Begin typing your search above and press return to search.

బీహార్ జనతా పరివార్ కు మజ్లిస్ షాక్

By:  Tupaki Desk   |   13 Sep 2015 4:57 AM GMT
బీహార్ జనతా పరివార్ కు మజ్లిస్ షాక్
X
మతంతో రాజకీయం చేసి.. పవర్ గేమ్ ఆడుతున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్.. సింఫుల్ గా చెప్పాలంటే ఎంఐఎం.. అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాజా ప్రకటన వణుకు పుట్టిస్తోంది. బీహార్ ఎన్నికల్లో తమదే విజయమని భావిస్తున్న జనతా పరివార్ కు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటన ఇబ్బందికరంగా మారింది.

మతంతో రాజకీయం ఎలా చేయాలో.. ఎన్నికల్లో విజయం సాధించాలో బాగా తెలిసిన మజ్లిస్ గత కొన్నేళ్లుగా హైదరాబాద్ పాతబస్తీలో ప్రయోగాత్మంగా పరీక్షలు నిర్వహించటం.. లెక్కలేనన్ని విజయాలు తన ఖాతాలో వేసుకోవటం తెలిసిందే.

పాతబస్తీలో తాను చేసిన ప్రయోగాల్నే మిగిలిన రాష్ట్రాల్లోనూ చేయాలని తహతహలాడుతున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. ఆ దిశగా వేస్తున్న అడుగులు ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఊహించని విధంగా విజయం సాధించిన మజ్లిస్.. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై గురి పెట్టింది.

బీహార్ లోని ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్ని గుర్తించి మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల్ని బరిలోకి దింపున్నట్లు పేర్కొనటం జనతా పరివార్ కు షాక్ గా మారింది. మజ్లిస్ ఎంపిక చేసిన 40 స్థానాలు.. జనతా పరివార్ కు మంచి పట్టున్న సీమాంచల్ పరిధిలోనివి కావటం గమనార్హం. ఇప్పటివరకూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో జనతాపరివార్ కే మొగ్గు ఉన్నట్లుగా చెబుతున్నా.. మజ్లిస్ ఎంట్రీతో.. మొత్తంగా దెబ్బ పడే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ప్రదర్శించిన మేజిక్.. బీహార్ లోనూ అసదుద్దీన్ ఓవైసీ చూపిస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.