Begin typing your search above and press return to search.

అమిత్‌ షాను నియంత‌ - ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   9 Dec 2019 3:44 PM GMT
అమిత్‌ షాను నియంత‌ - ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు చ‌ర్చ సంద‌ర్భంగా లోక్‌ స‌భ‌లో హాట్ హాట్ చ‌ర్చ జ‌రిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ‌ర్సెస్ ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ అన్న‌ట్లుగా మాటల‌ యుద్ధం జ‌రిగింది. పౌర‌స‌త్వ బిల్లును వ్య‌తిరేకించిన ఓవైసీ.. భార‌త్‌లో సెక్యుల‌రిజం మౌళిక‌మైంద‌న్నారు. అయితే, దీనికి బీజేపీ ర‌థ‌సార‌థి సైతం అదే రీతిలో ఘాటుగా స్పందించారు. కాగా, అమిత్‌ షా హిట్ల‌ర్ అని ఓవైసీ స‌భ‌లోనే కామెంట్ చేయ‌డం వివాదాన్ని రేకెత్తించింది.

పౌర‌స‌త్వ బిల్లు సంద‌ర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ...1947 నుంచి శరణార్థులను అంగీకరిస్తున్నామనీ.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సహా బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌ కే అద్వానీ సైతం శరణార్థి అని అన్నారు. బిల్లుకు 130 కోట్ల ప్రజల మద్దతు అవసరమనీ - సరిహద్దులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అమిత్‌షా అన్నారు. పౌరసత్వ బిల్లుతో ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగదని కేంద్ర హోం మంత్రి భ‌రోసా ఇచ్చారు. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ర్టాల ప్రజలు ఆందోళన చెందొద్దని ఆయన తెలిపారు. పౌరసత్వ సవరణ బిల్లుకు మేము కట్టుబడి ఉన్నామని హోం మంత్రి లోక్‌ సభలో అన్నారు. ఈ బిల్లు ద్వారా ఎవరి హక్కులు హరించడం లేదనీ - బిల్లు ద్వారా మైనార్టీలు మరిన్ని హక్కులు పొందుతారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. బిల్లులో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదనీ.. మార్పులను స్వాగతిస్తున్నామని తెలిపిన హోం మంత్రి.. దేశ ఐక్యతను విశ్వసిస్తున్నామన్నారు. మ‌తం ఆధారంగా దేశాన్ని కాంగ్రెస్ విభ‌జించ‌కుంటే.. ఇప్పుడు ఇలాంటి పౌర‌స‌త్వ బిల్లును తీసుకురావాల్సి వ‌చ్చేది కాద‌న్నారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు ఆర్టిక‌ల్ 11 - ఆర్టిక‌ల్ 14ల‌ను ఉల్లంఘిస్తోంద‌ని విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను షా కొట్టిపారేశారు. మ‌తం ఆధారంగా ప్ర‌భుత్వం చ‌ట్టాల‌ను చేసేందుకు ఆర్టిక‌ల్ 14 అడ్డుకోద‌ని షా అన్నారు. 1971 త‌ర్వాత బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన వారికి మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ ఎలా పౌర‌స‌త్వాన్ని క‌ల్పించారో కేంద్ర మంత్రి తెలిపారు.

అయితే, కేంద్ర మంత్రి అమిత్ షాపై ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. హిట్ల‌ర్ త‌ర‌హాలో కేంద్ర మంత్రి షా కూడా చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌ని ఓవైసీ కామెంట్ చేశారు. పౌర‌స‌త్వ బిల్లును వ్య‌తిరేకించిన ఓవైసీ.. భార‌త్‌ లో సెక్యుల‌రిజం మౌళిక‌మైంద‌న్నారు. పౌర‌స‌త్వ బిల్లు ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ఉల్లంఘిస్తోంద‌న్నారు. బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టి.. షా హిట్ల‌ర్‌ గా మారార‌ని ఓవైసీ ఆరోపించారు. బిల్లు వ‌ల్ల భార‌త్.. ఇజ్రాయిల్‌ గా మారుతుంద‌ని అస‌దుద్దీన్ విమ‌ర్శించారు. దీంతో బీజేపీ స‌భ్యులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆ స‌మ‌యంలో స్పీక‌ర్ ఆ వ్యాఖ్య‌ల‌ను రికార్డుల నుంచి తొల‌గిస్తున్న‌ట్లు చెప్పారు.