Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ ను చుట్టుకున్న ఐల‌య్య మంట‌లు

By:  Tupaki Desk   |   2 Oct 2017 3:30 PM GMT
కాంగ్రెస్‌ ను చుట్టుకున్న ఐల‌య్య మంట‌లు
X
కంచె ఐల‌య్య వ‌ర్సెస్ ఆర్య‌వైశ్యుల వివాదం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ను కుమ్మేస్తోంది. `సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు` శీర్షిక‌న ఐల‌య్య రాసిన పుస్త‌కం ఏపీ తెలంగాణ‌ల్లో మంట‌లు పుట్టించిన విష‌యం తెలిసిందే. వైశ్యుల‌ను స్మ‌గ్ల‌ర్లుగా పేర్కొన‌డాన్ని ఆ వ‌ర్గం వారితోపాటు ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు - విమ‌ర్శ‌లు - ప్ర‌తివిమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ క్ర‌మంలో ఏ ప‌క్షాన్ని వెనకేసుకు వ‌స్తే ఏం జ‌రుగుతుందోన‌ని రాజ‌కీయ పార్టీలు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డ్డాయి.

ఐల‌య్య‌ను స‌మ‌ర్ధిస్తే.. ఆర్య‌వైశ్యులు స‌హా బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి దూరం అవుతామ‌ని, అలాగ‌ని ఐల‌య్య‌ను తిడితే.. ద‌ళిత వ‌ర్గాల‌కు దూర‌మ‌వుతామ‌ని రాజకీయ నేత‌లు నోరు మెద‌ప‌కుండా మౌనం పాటించి వారి చావు వారే చ‌స్తారులే అనుకున్నారు. అయితే, అనూహ్యంగా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీ కీల‌క నేత ఐల‌య్య‌ను వెనుకేసుకు వ‌చ్చారు. తాము ద‌ళితుల‌కు అండ‌గా ఉంటామ‌ని, ఈ విష‌యంలో కాంగ్రెస్ ఐల‌య్య‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తుంద‌ని, ఆయ‌న‌పై దాడి హేయ‌మ‌ని ఆయన పెద్ద పెద్ద ప్ర‌క‌ట‌న‌లు చేశారు.

ఇప్పుడు ఈ ప‌రిణామ‌మే తెలంగాణ కాంగ్రెస్‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. వైశ్య సంఘాలు తీవ్రంగా మండి ప‌డుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆర్యవైశ్య సంఘం లేఖ రాసింది. వైశ్యులను కించపరిచిన ఐలయ్యకు సంబంధించి మద్దతుగా కొందరు కాంగ్రెస్ ప్రముఖులు ఢిల్లీలో ప్రకటన చేశారని విమర్శించింది. కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ఆర్యవైశ్యుల మనోభావాలను గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఐలయ్య రచించిన పుస్తకాన్ని నిషేధించేలా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకురావాలని, ప్రధాన ప్రతిపక్షమైన మీ మద్దతును తాము కోరుతున్నామని తెలిపింది. ఇప్పుడు ఈ ప‌రిణామంతో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిలో టీకాంగ్రెస్ నేత‌లు ఇరుక్కున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.