Begin typing your search above and press return to search.

సీఎం వేసిన పంచ్ మామూలుగా లేదు

By:  Tupaki Desk   |   21 Aug 2016 8:40 AM GMT
సీఎం వేసిన పంచ్ మామూలుగా లేదు
X
ప్ర‌ఖ్యాత ద్యాన విధాన‌మైన విపాసన అభ్యాసం పూర్తయిన తర్వాత మౌనంగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మళ్లీ తనదైన శైలిలో ప్రత్యర్థులపై విమర్శలకు పదును పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అంబానీలను దాసోహం అయితే... ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప్రభుత్వం అదానీలకు దోచిపెడుతోందని కేజ్రీవాల్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అంబానీల జేబులో ఉంటే..మోడీ అదానీల సేవలో తరిస్తున్నారని అన్నారు. గడిచిన మూడేండ్లలో అదానీ రాబడి మూడింతలు అయినట్టు వార్తలొచ్చాయని కేజ్రివాల్ ఆరోపించారు. సామాన్యుల ఆదాయం పెరిగితే పప్పుధాన్యాలు - ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేస్తారని - అదే సొమ్ము అదానీ జేబులోకి వెళితే ఆయన తన భార్యకు హెలికాఫ్టర్‌ కొనిస్తారని వ్యాఖ్యానించారు. 'మోడీజీ అదానీకి చేసిన సేవలు చాలు ఇక ప్రజల కోసం పనిచేయండని' ప్రధానిని ఉద్దేశించి అన్నారు.

ఇదిలాఉండ‌గా సామాన్యుల‌కు ఉప‌యుక్త‌మైన మ‌రో నిర్ణ‌యాన్ని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ తీసుకున్నారు. ఈ ఏడాది ఢిల్లీలో కొత్తగా మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. మద్యం షాపుల పరిధిలో ఉన్న స్థానికుల నుంచి ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాక నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు నడిపితే అట్టి యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తున్నదని ఆప్ మాజీ నాయ‌కులు - స్వరాజ్‌ అభియాన్‌ నేతలు ప్రశాంత్‌ భూషణ్‌ - యోగేంద్ర యాదవ్‌ లు గతవారం విమర్శించారు. నివాస ప్రాంతాల్లో ఉన్న లిక్కర్‌ షాపులను వెంటనే మూసివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీంతో కేజ్రీ ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.