Begin typing your search above and press return to search.

బీజేపీ నీతులు చెప్ప‌డం త‌ప్ప ఆచ‌రణ‌లో లేదా?

By:  Tupaki Desk   |   20 Sep 2017 1:30 AM GMT
బీజేపీ నీతులు చెప్ప‌డం త‌ప్ప ఆచ‌రణ‌లో లేదా?
X
``కొన్ని సంఘ విద్రోహకర శక్తులు సమాజంలో అశాంతిని రగిలించడానికి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. అయితే మీరు వాటి భ్ర‌మంలో ప‌డ‌వ‌ద్దు..``సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్ చేసిన సూచ‌న ఇది. ఢిల్లీలో సశస్త్ర సీమా బల్(ఎస్‌ ఎస్‌ బీ)కు చెందిన ఇంటెలిజెన్స్ విభాగాన్ని ప్రారంభించిన సంద‌ర్భంగా హోంమంత్రి సూచించారు. గుజ‌రాత్‌ లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా సైతం సోష‌ల్‌ మీడియాలో కొనసాగుతున్న ప్రచారాన్ని విశ్వసించవద్దని పార్టీ నేత‌లను కోరారు.

అయితే తమ పార్టీ శ్రేణుల్లో బీజేపీ ముఖ్య నేత‌లు క‌లిగిస్తున్న అవగాహ‌న ప‌ట్ల హ‌ర్షం వ్యక్తం చేస్తున్న‌ ప‌లువురు అదే స‌మ‌యంలో బీజేపీ నేత‌ల నైతిక‌త‌పై సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాల నుంచి మొద‌లుకొని ఎంపీల వ‌ర‌కు ఇలాగే వ‌క్రీక‌ర‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి అరుంద‌తీ రాయ్ విష‌యంలో బీజేపీ ఎంపీ తీరును గుర్తుచేస్తున్నారు. అరుంధతీరాయ్‌ ఇటీవల కశ్మీర్‌ పర్యటించార‌ని ఈ సంద‌ర్భంగా ‘భారత్‌ లోని 70 లక్షల మంది సైనికులు కలిసికట్టుగా దాడిచేసినా కశ్మీర్‌ స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న మిలిటెంట్లను ఏమీ చేయలేరు` అని ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె కామెంట్ చేశార‌ని బీజేపీ ఎంపీ ప‌రేశ్ రావ‌ల్ ప్ర‌స్తావిస్తూ ఆమె తీరుపై మండిప‌డ్డారు. ఇందుకోసం పోస్ట్ కార్డ్.న్యూస్ అనే వెబ్‌ సైట్‌ ను ఆధారంగా తీసుకున్నారు. అయితే బీజేపీ అనుబంధ‌మైన ఈ వెబ్‌ సైట్ త‌ప్పుడు వార్త రాసింద‌ని, రాయ్ కాశ్మీర్‌ కు వెళ్ల‌నేలేద‌ని తేలింది. దీంతో బీజేపీ ఎంపీ తీరును అంతా విమ‌ర్శించారు. మ‌రోవైపు బీజేపీకి ఇటీవ‌లి కాలంలో బీపీ పెంచేస్తున్నపశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ల‌క్ష్యంగా సృష్టించిన ప్ర‌చారంతో హిందువులు, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగేందుకు కార‌ణ‌మ‌య్యార‌ని ప‌లువురు అంటున్నారు. అల్ల‌ర్ల‌ను మరింత రెచ్చగొట్టడానికి బీజేపీ సమాచార సాంకేతిక విభాగం, అంటే పార్టీ ఐటీ అధిపతి అమిత్‌ మాలవీయ నకిలీ వార్తలను ప్రచారం చేసిన సంగ‌తి మ‌రిచిపోలేద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. పట్టపగలు ఓ హిందూ యువతిని ముస్లిం యువకులు రేప్‌ చేస్తున్నారంటూ ఓ మరాఠి చిత్రం షూటింగ్‌ స్టిల్‌ తో దుష్ప్ర‌చారం చేసిన తీరు అంద‌రినీ అవాక్కు చేసింద‌ని అంటున్నారు.

మ‌రోవైపు తాజా మాజీ ఉప రాష్ట్రపతి మహ్మద్‌ హమీద్‌ అన్సారీపైనా బీజేపీ అధికార ప్రతినిథి శంభిత్‌ పాత్ర సైతం వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశార‌ని గుర్తుచేస్తున్నారు. నకిలీ వార్త కారణంగా ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం ముస్లిం యువకుడిని జనమే కొట్టి చంపారని ప్ర‌స్తావిస్తున్నారు. స్థూలంగా...సోషల్ మీడియా, వాట్సప్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి నిరాధార, తప్పుడు సమాచారం విస్తృతంగా పంపిణీ జరుగుతుండ‌టంపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న బీజేపీ త‌మ నాయ‌కులు, సానుభూతిప‌రుల విష‌యంలో అదే విధానాన్ని ఎందుకు అవ‌లంభించ‌డం లేదనేది అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గా మిగిలింద‌ని అంటున్నారు.

అయితే ఈ ఇలాంటి న‌కిలీ వార్త‌లు మ‌న‌దేశానికి మాత్ర‌మే ప‌రిమితం కాలేద‌ని..ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్నాయ‌ని అంటున్నారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ గెలుపున‌కు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ స‌హాయం చేశార‌ని, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్‌ బ్లిగ్‌ టర్న్‌బిల్‌ ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ ను తిలకించే స‌మ‌యంలో మునిమనుమరాలును ముద్దాడుతూనే చిత‌లో మందు గ్లాసుతో ఉన్నార‌ని అంటున్నారు. అయితే ఆ దేశాల్లో క‌ఠిన‌మైన చ‌ట్టాలు ఉన్నాయ‌ని పేర్కొంటూ అలాంటివి మ‌న‌దేశంలోనూ తీసుకువ‌చ్చిన‌ప్పుడే ఇలాంటి సైబ‌ర్ నేరాల‌కు ఉద్దేశ‌పూర్వ‌క చ‌ర్య‌ల‌కు క‌ళ్లెం వేయ‌వ‌చ్చ‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.