Begin typing your search above and press return to search.

అదంతా కాంగ్రెస్ ఇంటర్నల్ మ్యాటరంట

By:  Tupaki Desk   |   17 July 2016 4:24 AM GMT
అదంతా కాంగ్రెస్ ఇంటర్నల్ మ్యాటరంట
X
అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో అత్యాశతో వ్యవహరించి అడ్డంగా బుక్ అయిన కమలనాథులు ఇప్పుడా ఇష్యూలో నుంచి బయటపడేందుకు కిందామీదా పడుతున్నారు. నిన్నటివరకూ కమలనాథులతో జట్టు కట్టిన కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు తిరిగి తమ గూటికి చేరిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నబం తుకిని రెండు రోజుల వ్యవధిలో అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. మరోవైపు అధికార కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా పెమా ఖండాను ఎన్నుకోవటం సరికొత్త పరిణామంగా చెప్పాలి.

ఈ ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశానికి హాజరైన 44 మంది పెమా ఖండూను తమ నేతగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. దీంతో.. తుకి తన పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగిన కాసేపటికే.. పెమా ఖండూ గవర్నర్ ను కలిసి తాను ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటానికి సిద్ధంగా ఉన్నానని.. తనకు 58మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో 47 మంది మద్దుతు ఉన్నట్లు వెల్లడించారు. తన బలాన్ని నిరూపించేందుకు సమయం ఇవ్వాలని కోరారు.

సుప్రీం తీర్పు.. అది వచ్చిన ఒకట్రెండు రోజుల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలపై బీజేపీ స్పందించింది. ఇదంతా కాంగ్రెస్ ఇంటర్నల్ ఇష్యూస్ గా అభివర్ణించటం గమనార్హం. వారి వ్యవహరంతో కేంద్రానికి కానీ.. తమకు కానీ సంబంధం లేదని.. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత గొడవగా అభివర్ణించారు. ఆ పార్టీలో చీలిక వల్లే సంక్షోభం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్న బీజేపీ.. అలా చీల్చిన పాపం తమదేనన్న నిజాన్ని దాచేసే ప్రయత్నం చేశారు. బీజేపీ కానీ ప్రోత్సహించకపోతే.. కాంగ్రెస్ పార్టీ చీలేదా? అన్న ప్రశ్నకు నిజాయితీతో సమాధానం ఇచ్చేందుకు ఏ బీజేపీ నేత సిద్ధంగా లేరనే చెప్పాలి.