Begin typing your search above and press return to search.

షేర్ మార్కెట్‌ ను షేక్ చేస్తున్న క‌శ్మీర్‌

By:  Tupaki Desk   |   5 Aug 2019 10:07 AM GMT
షేర్ మార్కెట్‌ ను షేక్ చేస్తున్న క‌శ్మీర్‌
X
స‌రిహ‌ద్దు రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌ కు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 7వ తేదీన ప్రకటన చేయనున్నారు. అయితే, ఈ ప‌రిణామాలు కేవ‌లం జ‌మ్ముక‌శ్మీర్‌ లో, దేశ‌వ్యాప్తంగానే కాకుండా...స్టాక్‌ మార్కెట్‌ ను సైతం కుదిపేస్తున్నాయి.

కశ్మీర్ లో టెన్షన్ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ నష్టాలతోనే స్టాక్ మార్కెట్లు ప్రారంభమయి అదే దోర‌ణిలో కొన‌సాగుతున్నాయి. ఉద‌యం నుంచి సెన్సెక్స్ 600 పాయింట్లు- నిఫ్టీ 186 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది. ఐసీఐసీఐ- యాక్సిస్ బ్యాంకు- బ్రిటానియా- బజాజ్ ఫినాన్స్- హీరో మోటార్ కార్స్- డీహెచ్ ఎఫ్ ఎల్‌- ఎల్ ఐసీ హౌసింగ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 70 రూపాయల 46 పైసలు ఉంది. హెచ్‌ డీఎఫ్‌ సీ- టీఎసీఎస్‌- ఎన్‌ టీపీసీ- హెచ్‌ సీఎల్ టెక్- ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లలో కొనసాగుతున్నాయి.

కాగా, జమ్మూకశ్మీర్ రాష్ర్టాన్ని కేంద్రం రెండు భాగాలుగా విభజన చేయ‌డంతో దేశంలో రాష్ర్టాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. జమ్మూకశ్మీర్ నుంచి లడఖ్ ను వేరు చేసి అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. దీంతో రాష్ర్టాల సంఖ్య 28కి తగ్గింది. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కి చేరింది.