Begin typing your search above and press return to search.

కేర‌ళ క‌ర్కోటకుడు... చిక్క‌డు, దొర‌క‌డు!

By:  Tupaki Desk   |   11 March 2017 9:53 AM GMT
కేర‌ళ క‌ర్కోటకుడు... చిక్క‌డు, దొర‌క‌డు!
X
నిజ‌మే... సిల్వ‌ర్ స్క్రీన్‌ పై వ‌చ్చిన ఎన్నో సినిమాల‌కు ఈ కేసు క‌ధా వ‌స్తువుగా నిలిచింది. ఈ కేసు ఆధారంగా తెర‌కెక్కిన చిత్రాల‌న్నీ వ‌చ్చాయి... వెళ్లాయి.. ఈ కేసు మాత్రం ఇప్ప‌ట‌కీ తేల‌లేదు. ఇప్ప‌టికీ అంటే... ఏ ఐదేళ్లో - ప‌దేళ్లో అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే ఈ కేసు 33 ఏళ్లుగా ప‌రిష్కారం లేకుండా... కేర‌ళ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక కాలం విచార‌ణ సాగిన కేసుగా రికార్డుల‌కెక్కింది. అంతేకాదండోయ్‌... ఇప్ప‌టికీ ఈ కేసు తేల‌లేదు. స‌మీప భ‌విష్య‌త్తులో కూడా తేలే సూచ‌న‌లు కూడా క‌నిపించ‌డం లేదు. అయినా ఈ కేసులోని ప్ర‌ధాన నిందితుడైన కేర‌ళ వ్య‌క్తిని క‌ర్కోట‌కుడేనా? అంటే... ముమ్మాటికీ క‌ర్కోట‌కుడిగానే చెప్పాలి. ఎందుకంటే.. త‌న స్వ‌లాభం కోసం మొత్తం వ్య‌వ‌స్థ‌నే నాశ‌నం చేసిన ఈ వ్య‌క్తి... ఈ వ్య‌వ‌హారంతో ఏమాత్రం సంబంధం లేని వ్య‌క్తి ప్రాణాల‌ను హ‌రించేశాడు.

ఇక ఈ కేసు వివ‌రాల్లోకెళితే... 1984 జనవరి 22న కేరళలో సుకుమార కురూప్ అనే వ్యక్తికి నాడు 38 ఏళ్లు. అబుదాబిలో పనిచేసేవాడు. 8 లక్షల రూపాయలకు బీమా చేయించాడు. జర్మనీలో జరిగిన ఓ ఘటనను స్ఫూర్తిగా తీసుకున్న కురూప్.. తాను మరణించినట్టుగా ఆధారాలు సృష్టించి బీమా క్లయిమ్ చేసుకోవాలని పథకం పన్నాడు. ఇందుకు సోదరుడు భాస్కర పిళ్లై - డ్రైవర్ పొన్నప్పన్ సహకరించారు. మొదట కురూప్ లాగే ఉండే మనిషి డెడ్ బాడీ కోసం వీరు గాలించారు. దొరకపోవడంతో అతనిలాగే ఉండే వ్యక్తిని చంపి - కురూప్ మరణించినట్టు అందర్నీ నమ్మించాలని ప్లాన్ మార్చారు. కురూప్‌ లాగే ఎత్తు - బరువు ఉండే చాకో అనే వ్యక్తి వీరికి తారసపడ్డాడు. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి వారు చాకోను కారులో ఎక్కించుకున్నారు. మత్తుపదార్థాలు కలిపిన డ్రింక్ చాకోకు ఇచ్చి, అపస్మారక స్థితిలోకి వెళ్లాక పిళ్లై అతన్ని చంపేశాడు. చాకో ముఖాన్ని గుర్తుపట్టకుండా ఉండేలా కాల్చారు. 1984 జనవరి 22 ఆయన డెడ్‌ బాడీని కారులో ఉంచి మవెలిక్కర సమీపంలోని కున్నం దగ్గర కారును తగలబెట్టారు.

పోలీసులు మొదట కురూప్ చనిపోయినట్టు భావించారు. కాగా విచారణలో అది కురూప్ మృతదేహం కాదని తేలింది. విషపదార్థం ఇచ్చి చంపారని - మృతదేహాన్ని డ్రైవర్ సీటులో ఉంచి కారును కాల్చివేసినట్టు తేలింది. కురూపే ఈ హత్యకు పథకం వేసి ఉంటాడని పోలీసులు భావించారు. చాకో అదృశ్యమయ్యాక ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. జీవిత బీమాను క్లయిమ్ చేసుకోవాలని కురూప్‌ వేసిన పథకం ఇదని తేలింది. దీంతో అత‌డు అజ్ఞాతంలోకి వెళ్లాడు. 1984 నుంచి పోలీసులు కురూప్ కోసం గాలిస్తూనే ఉన్నారు.. కానీ 33 ఏళ్లు గడిచినా అతని ఆచూకీ కనుగొనలేకపోయారు. కోర్టు కురూప్‌ పై అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తూనే ఉంది గానీ... నేటికీ మిస్టరీ వీడలేదు. ఇప్పుడు కూడా మరోసారి ఆయన పై అరెస్టు వారెంటు జారీ అయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/