Begin typing your search above and press return to search.

ఆర్మీకి కేంద్రం 'సోష‌ల్' వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   13 July 2019 5:11 AM GMT
ఆర్మీకి కేంద్రం సోష‌ల్ వార్నింగ్‌!
X
ఇవాల్టి రోజున సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌లు ఎంత‌గా క‌నెక్ట్ అయ్యారో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియా.. వాట్సాప్ తో సంబంధం లేని వారు దాదాపుగా క‌నిపించ‌ని ప‌రిస్థితి. ఎవ‌రికి వారుగా ఎంగేజ్ అయ్యేలా చేసిన ఈ సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫాం పుణ్య‌మా అని కొత్త స‌మ‌స్య‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయి. తాజాగా అలాంటి ప‌రిస్థితే నెల‌కొంది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. తాజాగా ల‌క్ష‌లాది మంది సైనికులు వాట్సాప్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎందుకిలా అంటే.. ఆర్మీ ఉద్యోగుల‌కు కొద్ది రోజుల క్రితం కేంద్ర ర‌క్ష‌ణ శాఖ నుంచి రెండు పేజీల మార్గ‌ద‌ర్శ‌కాలు వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో ఏముంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు రాకున్నా.. ఆ నోట్ అందిన రోజుల వ్య‌వ‌ధిలోనే పెద్ద ఎత్తున వాట్సాప్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న అంచ‌నాల ప్ర‌కారం దాదాపుగా 13 ల‌క్ష‌ల మంది సైనికులు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు.

తాజాగా అందుకున్న నోట్ తో సైనిక వ‌ర్గాల మ‌ధ్య ఉండే వాట్సాప్ గ్రూపులను క్లోజ్ చేయటంతోపాటు.. వాట్సాప్ వినియోగాన్ని మానేసిన‌ట్లుగా తెలుస్తోంది. అంతే కాదు.. ట్రూ కాల‌ర్.. వీ చాట్.. యూసీ బ్రౌజ‌ర్ లాంటి 42 యాప్స్ ను ఆర్మీలో బ్యాన్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇంతేకాదు.. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు.. డిఫెన్స్ ఉద్యోగుల‌కు తాజాగా సోష‌ల్ మీడియా వినియోగంపై కొత్త హెచ్చ‌రిక‌ల్ని మోడీ స‌ర్కారు చేసింది. ఆఫీసు కంప్యూట‌ర్ల‌లో సోష‌ల్ మీడియాను వాడొద్ద‌ని.. అధికారుల అనుమ‌తితోనే పెన్ డ్రైవ్ ల‌ను వాడొద్ద‌న్నారు. ప‌బ్లిక్ వైఫైల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో వాడ‌కూడ‌ద‌ని.. ఒక‌వేళ ఇంటి నుంచి అధికారిక ఈ-మొయిల్ పంపాల్సి వ‌స్తే ఉద్యోగులు వినియోగించే వైఫై రౌట‌ర్ కు త‌ప్ప‌నిస‌రిగా మ్యాక్ అడ్ర‌స్ ఉండాల‌ని నిర్దేశించారు.

సోష‌ల్ మీడియాలో అధికారిక వివ‌రాలు షేర్ చేయ‌కూడ‌ద‌ని.. అధికారిక ఫైళ్ల‌ను క్లౌడ్ లో పెట్ట‌కూడ‌ద‌న్నారు. ఇలా ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాల్ని తాజాగా చేసిన‌ట్లు తెలుస్తోంది. త‌ర‌చూ ప్ర‌భుత్వ విభాగాల‌కు చెందిన వెబ్ సైట్లు హ్యాకింగ్ కు గురి కావ‌టంతో పాటు.. కీల‌క‌మైన అంశాలు బ‌య‌ట‌కు పొక్క‌టానికి కూడా సోషల్ మీడియా కార‌ణ‌మ‌న్న మాట వినిపిస్తోంది. దీంతో.. కేంద్రం దిద్దుబాటు చ‌ర్య‌ల్ని స్టార్ట్ చేసిన‌ట్లు చెబుతున్నారు.