Begin typing your search above and press return to search.

ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు.. ఏ క్షణంలో అయినా ఏమైనా జరగొచ్చు

By:  Tupaki Desk   |   19 Dec 2019 4:46 AM GMT
ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు.. ఏ క్షణంలో అయినా ఏమైనా జరగొచ్చు
X
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ఆర్మీ చీఫ్ లు పని చేశారు. కానీ.. గతంలో పని చేసిన ఆర్మీ చీఫ్ లు మౌనంగా ఉండేవారు. ఏమైనా చెప్పాల్సి వస్తే ప్రభుత్వానికి సమాచారం అందించేవారే తప్పించి.. తమకు తాముగా మీడియా ఎదుటకు.. ప్రజల ఎదుటకు వచ్చి ప్రకటనలు చేయటం.. ఊహించని రీతిలో స్పందించటం లాంటివి చేసేవారు కాదు.

అందుకు భిన్నంగా భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను చెప్పాలి. గడిచిన కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతుంటాయి. తాజాగా ఆయన అదే తరహాలో రియాక్ట్ అయ్యారు. జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంట చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీసేలా చేసింది.

జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో ఏ క్షణమైనా పరిస్థితులు తీవ్రతరం కావొచ్చన్నది ఆయన మాట. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత దళాలు సిద్ధంగా ఉననట్లు చెప్పారు. ఆర్టికల్ 370 నిర్వీర్యం తర్వాత పాక్ వైపు నుంచి కవ్వింపులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాయాది దేశం పదే పదే ఉల్లంఘిస్తోందంటూ వస్తున్న నివేదికలపై స్పందించిన రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు నుంచి అక్టోబరు మధ్య కాలంలో పాకిస్తాన్ 950 సార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. సరిహద్దుల్లో పాక్ భారీ కుట్రకు ప్లాన్ చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్న వేళ.. రావత్ నోటి నుంచి వచ్చిన తాజా వ్యాఖ్యలు కీలకంగా మారాయని చెప్పక తప్పదు.