Begin typing your search above and press return to search.

లైను దాటేస్తామని వార్నింగ్ ఇచ్చేసిన భారత ఆర్మీచీఫ్

By:  Tupaki Desk   |   30 Sept 2019 12:08 PM IST
లైను దాటేస్తామని వార్నింగ్ ఇచ్చేసిన భారత ఆర్మీచీఫ్
X
గత ఆర్మీ చీఫ్ లకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. గతంలో ఆర్మీ చీఫ్ అంటే ఆచితూచి అన్నట్లుగా అప్పుడప్పుడు మాట్లాడటమే తప్పించి.. అంతకు మించి ఒక్క వ్యాఖ్య చేసేవారు కాదు. మోడీ హయాంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దాయాది దుశ్చర్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. నేరుగా హెచ్చరికలు చేస్తున్నారు.

అమెరికా పర్యటనను ముగించుకొని స్వదేశానికి చేరుకున్న ఇమ్రాన్.. ఎయిర్ పోర్ట్ లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. కశ్మీరీలు జిహాద్ చేస్తున్నారని.. వారికి సాయం చేయటం కూడా పవిత్ర యుద్ధమేనని చెప్పారు. ప్రజలకు అండగా ఉంటే.. కశ్మీరీలు విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు. దీనిపై ఆర్మీచీఫ్ రావత్ రియాక్ట్ అయ్యారు.

పాక్ తో దాగుడుమూతలు ఎంతోకాలం సాగవని.. భారత్ అంటే ఏమిటో మెరుపుదాడులతో తాము ఇప్పటికే చెప్పామన్నారు. జిహాద్ పేరు చెప్పి పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తోందన్నారు. పాక్ హద్దులు మీరుతోందని.. దాగుడుమూతలు ఎన్నో ఏళ్లు సాగవన్నారు. భారత్ తో యుద్ధం చేయటమే పాకిస్థాన్ పాలసీగా పెట్టుకున్నట్లుందన్నారు.

ఒకవేళ అదే నిజమైతే తాము పాక్ కు సరైన రీతిలో బుద్ధి చెబుతామన్నారు. అవసరమైతే ఈసారి సరిహద్దు దాటేందుకు వెనుకాడమన్నారు. పాక్ హద్దు మీరుతుందని.. వాయు.. రోడ్డు మార్గం ద్వారా సరిహద్దు రేఖను దాటేస్తామని తేల్చి చెప్పటం గమనార్హం. అదే సమయంలో.. భారత్ కు అణ్వాయుధాల్ని యుద్ధంలో ఉపయోగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.