Begin typing your search above and press return to search.

ఎన్‌డీఏలో మహిళల ప్రవేశానికి సాయుధ దళాల సంచలన నిర్ణయం..ఏంటంటే

By:  Tupaki Desk   |   8 Sept 2021 3:33 PM IST
ఎన్‌డీఏలో మహిళల ప్రవేశానికి సాయుధ దళాల సంచలన నిర్ణయం..ఏంటంటే
X
మనదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓ చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తో దేశంలోని ప్రతి ఒక్క మహిళ కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అని చాటి చెప్తూ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌ డీఏ)లో మహిళలను చేర్చుకోవాలని సాయుధ దళాలు నిర్ణయం తీసుకున్నాయి అని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఎన్‌ డీఏ ద్వారా పర్మనెంట్ కమిషన్‌ కు మహిళలను నియమించుకోవడంపై సాయుధ దళాల ఉన్నత స్థాయి అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఎన్డీయేలో శిక్షణ పొందడానికి, నావల్ అకాడమీ పరీక్షలో పాల్గొనడానికి మహిళా అభ్యర్థులను అనుమతించే దిశగా దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా కేంద్రం సుప్రీం కోర్టుకు ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఈ అంశంపై అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి.. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనానికి వివరిస్తూ ”ఎన్డీయేలో బాలికలకు ప్రవేశం లభిస్తుందన్న సమాచారాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము వివరణాత్మక అఫిడవిట్‌ ను త్వరలోనే సమర్పిస్తాం. జూన్ 24న జరగాల్సిన పరీక్ష ఈ ఏడాది నవంబర్‌ కు వాయిదా పడింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఎన్డీయే ప్రవేశాలు యధాతధంగా కొనసాగేలా చూడాలని ఏఎస్జీ సుప్రీం కోర్టును కోరింది.

ప్రస్తుతం ఎన్డీయేలో మహిళలను చేర్చాలని సాయుధ సేవలు నిర్ణయించాయి. ఈ అంశంపై పూర్తిగా విశ్లేషణ జరుపుతున్నారంటూ కేంద్రం తరపు వాదనలను వినిపించిన ఏఎస్జీ, కోర్టు నుండి రెండు వారాల సమయాన్ని కోరింది. సాయుధ దళాలు దేశంలో గౌరవనీయమైన శాఖ, వారు లింగ సమానత్వం కోసం మరింతగా కృషి చేస్తారని భావిస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో మేం సంతోషంగా ఉన్నాం. సంస్కరణలు ఒక రోజులో జరగవని మాకు తెలుసు అని ధర్మాసనం వివరించింది. కాగా, ఎన్డీయే పరీక్షకు మహిళలను అనుమతించకపోవడంపై సుప్రీం కోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లింగ వివక్ష చూపరాదని.. అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనితో తాజాగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు నేషనల్లో డిఫెన్స్ అకాడమీలో స్థానాన్ని కల్పించింది.

కోర్టు స్పందిస్తూ, ఈ పనిని తమంతట తామే చేయాలని తాము అనేకసార్లు అధికారులకు చెప్పినట్లు తెలిపింది. సరైన విధానాలను రూపొందించేందుకు అన్నివిధాలుగా వారు తగినవారని తెలిపింది. ఏదీ జరగనపుడు కోర్టు రంగంలోకి దిగుతుందని, ఆ విధంగా ముందుకు రావడం సంతోషకరం కాదని పేర్కొంది. సాయుధ దళాలే ఈ పనిని తమంతట తామే చేయాలని పేర్కొంది. సాయుధ దళాలు మన దేశానికి గౌరవప్రదమైనవని, అయితే స్త్రీ, పురుష సమానత్వం విషయంలో చేయవలసినది ఇంకా చాలా ఉందని తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అడ్వకేట్ కుష్ కల్రా దాఖలు చేసిన పిటిషన్‌ పై ఈ విచారణ జరుగుతోంది. ఎన్‌డీఏలో మహిళలు చేరకుండా నిరోధించడం సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని పిటిషనర్ ఆరోపణలు చేశాడు.

దీనితో పాటుగా తాజాగా తాలిబన్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాలిబన్లు తీసుకున్న ఈ నిర్ణయం తో అఫ్గాన్ మహిళలు క్రికెట్‌ తో సహా ఎలాంటి క్రీడల్లో ఇక కనిపించరు. ఎందుకంటే క్రీడలు వారి శరీరాలను బహిర్గతం చేస్తాయని, అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబాన్లు బుధవారం ప్రకటించారు. మహిళలకు క్రీడా కార్యకలాపాలు అవసరం లేదని తాలిబాన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిక్ మీడియాతో వెల్లడించారు . అయితే.. ఇప్పటికే అనేకమంది ఆఫ్ఘన్ క్రీడాకారులు దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ మహిళా క్రికెట్ జట్టు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారికోసం తాలిబన్లు గాలిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాలిబాన్ మొదటి పాలన 2001లో ముగిసి.. తాజాగా మళ్లీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే. ముల్లా హసన్ అఖుంద్ నేతృత్వంలో కొత్త ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబాన్లు మంగళవారం ప్రకటించారు.