Begin typing your search above and press return to search.

విజయనగరంలో టెండూల్కర్

By:  Tupaki Desk   |   31 Oct 2015 11:39 AM GMT
విజయనగరంలో టెండూల్కర్
X
సచిన్ టెండూల్కర్ అంటే ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్ మన్లలో ఒకరు... ఆయన కుమారుడు అర్జున్ మాత్రం బ్యాటింగు కంటే బౌలింగులో రాణిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అది కూడా ఏ ముంబయిలోనో, ఢిల్లీలోనో కాదు... ఏపీలో... ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో సచిన్ కుమారుడు క్రికెట్ ఆడుతున్నాడు. అవును... విజయనగరం సర్ విజ్జీ మైదానంలో జరుగుతున్న ముంబై, విదర్భ జట్ల క్రికెట్‌ ప్రాక్టిస్‌ మ్యాచ్‌ లో అర్జున్ బౌలింగ్ లో ప్రతిభ చూపాడు.

శనివారం మూడో రోజుకు చేరుకున్న ఈ ఆటలోముంబై తరపున బౌలింగ్‌కు అర్జున్‌ టెండూల్కర్‌ 61 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి దిగిన ముంబై జట్టు 314 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేపట్టిన విదర్భా జట్టు లక్ష్యాన్ని చేధించే దిశగా 295 పరుగులు చేరుకుంది. శనివారం సాయంత్రంతో మ్యాచ్‌ ముగుస్తుంది. అంతకుముందు రోజు ఆటలో 50 బంతుల్లో 25 పరుగులు చేసిన అర్జున్ టెండూల్కర్ ఔటయ్యాడు. ఇందులో మూడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ ముంబై జట్టు 125.4ఓవర్లలో 314 పరుగులు చేసి అలౌటైంది. అనంతరం విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 54ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కాగా, సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ విజ్జీ మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడని తెలిసి క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. అంతర్ రాష్ట్ర అండర్-16 క్రికెట్ మ్యాచుల్లో భాగంగా ముంబై, విదర్భ జట్ల మధ్య మ్యాచులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరంలో ప్రాక్టీస్ మ్యాచులు మూడురోజులపాటు జరుగుతున్నాయి.