Begin typing your search above and press return to search.

అర్జున్‌ టెండూల్కర్‌ కు ఐపీఎల్ 2021 నుండి అవుట్

By:  Tupaki Desk   |   30 Sep 2021 11:30 AM GMT
అర్జున్‌ టెండూల్కర్‌ కు ఐపీఎల్ 2021 నుండి అవుట్
X
డిఫెండిండ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ జట్టు ఆల్‌ రౌండర్ అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ 2021 రెండో దశకు పూర్తిగా దూరం అయ్యాడు. గాయపడిన అర్జున్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. దీంతో అతడి స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్‌ ను తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్‌ మెంట్ బుధవారం ప్రకటించింది. ముంబై ఇండియన్స్ జట్టులోకి సిమర్‌ జీత్ సింగ్‌ ను అర్జున్ టెండుల్కర్ బదులు రిప్లేస్ చేసింది.

ప్రపంచ క్రికెట్ దేవుడు .. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ గాయంతో ఐపీఎల్‌ 2021లో మిగతా మ్యాచ్‌ లకు దూరమయ్యాడు. గత డిసెంబర్‌ లో జరిగిన వేలంలో అర్జున్‌ టెండూల్కర్‌ ను ముంబై ఇండియన్స్‌ కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అర్జున్‌ ముంబై తరపున ఒక్క మ్యాచ్‌ లో కూడా బరిలోకి దిగలేదు. అలా ఐపీఎల్‌ ఆడకుండానే గాయం కారణంగా అర్జున్‌ తప్పుకోవాల్సి వచ్చింది.

ఇక అర్జున్‌ ముంబై తరపున సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో రెండో టి20 మ్యాచ్‌ లు ఆడాడు. కాగా గాయంతో దూరమైన అర్జున్‌ టెండూల్కర్‌ స్థానంలో రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ సిమర్‌ జీత్‌ సింగ్‌ ను తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్‌ తన ట్విటర్‌ లో ప్రకటించింది. కాగా 23 ఏళ్ల సిమర్‌ జీత్‌ సింగ్‌ దేశవాలి క్రికెట్‌లో 10 ఫస్ట్‌క్లాస్‌, 19 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ లు, 15 టి20లు ఆడి మొత్తంగా 74 వికెట్లు పడగొట్టాడు. అయితే సిమర్‌ జీత్‌ సింగ్‌ గత జూలై లో శ్రీలంకలో పర్యటించిన టీమిండియా జట్టుకు నెట్‌ బౌలర్‌ గా ఎంపికయ్యాడు.

కాగా, వేలానికి ముందు అర్జున్ టెండుల్కర్ తన ప్రదర్శనతో పతాక శీర్షికలకు ఎక్కాడు. పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ క్రికెట్ టోర్నమెంట్‌ 2020-21లో ఎంఐజీ క్రికెట్ క్లబ్ తరపున ఆడిన అర్జున్ 3 వికెట్లు తీయడంతో పాటు 31 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. దీంతో ఇస్లామ్ జింఖానా జట్టుపై 194 పరుగుల తేడాతో విజయం సాధించింది. జూనియర్ స్థాయిలో ఆల్‌రౌండర్‌గా అర్జున్ టెండుల్కర్‌కు మంచి రికార్డులు ఉన్నాయి.

ఇక ముంబై ఇండియన్స్ రెండో దశ ఐపీఎల్‌ లో వరుస ఓటములతో సతమతం అయ్యింది. దీంతో నాలుగో స్థానం నుంచి ఏకంగా ఏడో స్థానానికి పడిపోయింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే వరుసగా అన్ని మ్యాచ్‌ లు గెలవాల్సిన పరిస్థితిలో మంగళవారం పంజాబ్ కింగ్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌ కు లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్‌ లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ ద్వారా హార్దిక్ పాండ్యా ఫామ్‌ లోకి రావడంతో ముంబై జట్టు ఊపిరి పీల్చుకుంది. పాండ్యా కేవలం 30 బంతుల్లో 40 పరుగులు బాదాడు. ఇందులో అతడి ట్రేడ్ మార్క్ సిక్స్‌ లు రెండు ఉండటం గమనార్హం.