Begin typing your search above and press return to search.

ఐపీఎల్-2020లో అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం?

By:  Tupaki Desk   |   15 Sept 2020 1:00 PM IST
ఐపీఎల్-2020లో అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం?
X
కరోనా మహమ్మారి నేపథ్యంలో యుఏఈలో జరగనున్న ఐపీఎల్-2020కి మరో నాలుగు రోజుల్లో తెర లేవనుంది. బయో సెక్యూర్ బబుల్ విధానంలో జరగబోతోన్న ఈ మెగా టోర్నీలో పాల్గొనే 8 జట్లకు చెందిన ఆటగాళ్లంతా ఇప్పటికే యుఏఈ చేరుకున్నారు. క్వారంటైన్ ను ముగించుకున్న ఆటగాళ్లు ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. అయితే, బయో సెక్యూర్ బబుల్ విధానంలో జట్టు యాజమాన్యం, ఆటగాళ్లకు మాత్రమే హోటల్, మైదానంలోకి అనుమతి ఉంటుంది. వేరే ఎవరికీ అనుమతి లేదు. కానీ, అనూహ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు తో జట్టు సభ్యుడు కాని ఓ యువ క్రికెటర్ చక్కర్లు కొడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు, అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టులోని కొందరు ఆటగాళ్ల తో స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫొటో ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదు. కానీ, బయో బబుల్ విధానంలో ఆటగాళ్లకు అర్జున్ అంత దగ్గరగా మెలగడం చర్చనీయాంశమైంది. దీంతో, ముంబై తరఫున ఈ ఐపీఎల్ లో అర్జున్ అరంగేట్రం చేయబోతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ముంబై పేసర్లు ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్ లతో కలిసి స్విమ్మింగ్ ఫూల్‌ లో అర్జున్ ఈత కొడుతున్న ఫొటో వైరల్ అయింది. అర్జున్ క్వారంటైన్‌ని కూడా పూర్తి చేసుకుని ముంబై జట్టుతో కలిసి నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇటీవల ఇంగ్లండ్‌లో బౌలింగ్ శిక్షణ పొందిన అర్జున్...ఆరంగేట్రం కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాడు. దీంతో, అర్జున్ అరంగేంట్రంపై పుకార్లు వస్తున్నాయి. అయితే, ఇందుకు అసలు కారణం వేరే ఉంది. ముంబై జట్టుతో పాటు భారత జట్టుకు కూడా నెట్‌ బౌలర్ గా అర్జున్ చాలా కాలంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముంబై బ్యాట్స్ మెన్లకు నెట్స్‌లో బౌలింగ్ చేసేందుకు అర్జున్ కూడా ముంబై జట్టు‌తో యుఏఈ వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ చెప్పక పోవడంతో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ లో అర్జున్ ఆడినా ఆశ్చర్య పోనవసరం లేదు. టోర్నీ జరుగుతుండగా ఎవరైనా ఆటగాడు గాయ పడితే.. అతడి స్థానంలో కొత్త ఆటగాడిని ప్రాంచైజీ తీసుకునే వెసులబాటుని బీసీసీఐ గత ఏడాది నుంచి కల్పిస్తోంది. కొత్త ఆటగాడు వేలంలోకి వచ్చి ఉండాలన్న నిబంధనను బీసీసీఐ గత ఏడాది నుంచి తీసి వేసింది. కరోనా నేపథ్యంలో వేలంలోకి రాకున్నా పర్లేదు. కానీ, ఆ ఆటగాడు యూఏఈలో ఉండి, బయో బబుల్ లో క్వారంటైన్ పూర్తి చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యం లోనే ముంబై జట్టు లో ఎవరన్నా ఆటగాడు గాయపడితే....అర్జున్ అరంగేట్రం జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు.