Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిపై సుప్రీం కోర్టులో.. ఎవ‌రి వాద‌న‌లు ఏంటి?

By:  Tupaki Desk   |   28 Nov 2022 10:33 AM GMT
అమ‌రావ‌తిపై సుప్రీం కోర్టులో.. ఎవ‌రి వాద‌న‌లు ఏంటి?
X
రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాన్ని చేప‌ట్ట‌డంపై గ‌తంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సుప్రీం కోర్టు ఈ రోజు ఉదయం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం.. 12 గంట‌ల వ‌ర‌కు వాదోప‌వాదాలు జ‌రిగాయి. ప్ర‌భుత్వం, రైతుల ప‌క్షాన సీనియ‌ర్ న్యాయ‌వాదులు త‌మ త‌మ వాద‌న‌లు వినిపించారు. మ‌ధ్య‌లో జోక్యం చేసుకున్న న్యాయ‌మూర్తులు జ‌స్టిస్‌ కెఎం.జోసెఫ్, జస్టిస్ బివి.నాగరత్నల‌తో కూడిన ధ‌ర్మాసనం ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. ఈ నేప‌థ్యంలో అస‌లు వాద‌నల తీరు ఎలా ఉందంటే..

ప్ర‌భుత్వ వాద‌న‌లు..

ధ‌ర్మాస‌నం విచార‌ణ‌ను ప్రారంభిస్తూనే ప్ర‌భుత్వం త‌ర‌ఫున అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్ వాద‌న‌లు వినిపించారు. ''రాజధాని అనేది స్థిరమైనది కాదు. అసాధ్యమైన పనులన్నీ చేయమని హైకోర్టు చెపుతోంది. సమయాను కూలంగా రాజధానిని మార్చుకునే అధికారం లేదా? ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వండి. మూడు రాజధానుల చట్టాన్ని ప్ర‌భుత్వం రద్దు చేసింది. రేపు శాసన వ్యవస్థ ఏం చేస్తుందో చెప్పలేము'' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రైతుల కాంట్రాక్ట్ ప్రయోజనాలను కాపాడుతాం. మేము మరింత యాన్యుటి పెంచామ‌ని కోర్టుకు తెలిపారు.

న్యాయ‌మూర్తులు జోక్యం చేసుకుని..

''హైకోర్టు ఆరు నెల‌ల కాల వ్యవధి లోపల రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ఎలా చెబుతుంది. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా.. ఇలాంటి అంశాలలో నైపుణ్యం లేకుండా ఇలాంటి ఆదేశిలిస్తారా..? రెండు నెలలలో నిర్మాణం చేయమంటారా? మౌలిక వ‌స‌తులు క‌ల్పించ‌మంటారా? సాధ్య‌మ‌య్యేనా? కోర్టులు ఎప్పటికీ ప్రభుత్వాలు కాదు. అలాంటి ఆదేశాలు ఇవ్వొచ్చా?. మీరే ప్రభుత్వమైతే, అక్కడ క్యాబినెట్ ఎందుకు?. హైకోర్టు ప్రభుత్వం లాగా వ్యవహరిస్తోందా ?'' అని న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు.

జ‌స్టిస్ జోసెఫ్ ఏమ‌న్నారంటే..

'' అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించడం ఎలా కుదురుతుంది? ఏ నగరాలను అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కదా! హైకోర్టు ఈ అంశంలో తన పరిధిని అతిక్రమించింది. హైకోర్టులో కనీసం క్యాంటిన్లు లేవని అంటున్నారు. దానిపై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తాం'' అని అన్నారు.

రైతుల త‌ర‌ఫున వాద‌న‌లు ఇవీ..

రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది శ్యామ్ దివాన్ వాద‌న‌లు వినిపించారు. ''ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల చ‌ట్టం చేసి రైతుల‌కు అన్యాయం చేస్తోంది. వారికి ఇవ్వాల్సిన ఫ్లాట్ల‌ను ఇవ్వ‌డం లేదు. హైకోర్టు ఆదేశాల‌ను అమ‌ల‌య్యేలా ఆదేశాలు ఇవ్వండి'' అని వాద‌న‌లు వినిపించారు.

మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవే.

ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను ర‌ద్దు చేసేందుకు నిరాక‌రిస్తూ.. ప్ర‌ధాన‌మైన కాల‌ప‌రిమితితో కూడిన ఏడు అంశాల‌పై స్టే విధించింది. పూర్తిస్థాయి వాద‌న‌లు వినేందుకు జ‌న‌వ‌రి 13 నాటికి సిద్ధ‌మై రావాల‌ని ప్ర‌తివాదుల‌కు స‌మ‌యం ఇచ్చింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.