Begin typing your search above and press return to search.

మాకు డెవలప్మెంట్ కావాలి, డిస్టర్బెన్స్ వద్దు - విశాఖ మనోగతం

By:  Tupaki Desk   |   12 Oct 2022 4:32 AM GMT
మాకు డెవలప్మెంట్ కావాలి, డిస్టర్బెన్స్ వద్దు - విశాఖ మనోగతం
X
ఎన్నికలకు ముందు.. ఎన్నికల ప్రచార సమయంలోనూ తాము అధికారంలోకి వచ్చినంతనే అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తామని.. అత్యద్భుత రాజధాని నగరాన్ని నిర్మిస్తామని జగన్ అండ్ టీం మాటలు చెప్పటం.. ప్రజలు నమ్మని వేళలో.. ప్రమాణాలు చేసి మరీ నమ్మించిన ప్రయత్నం చేయటం తెలిసిందే. ఇవాల్టి రోజున విశాఖ రాజధాని కోసం భారీ వాదనల్ని సిద్ధం చేస్తున్న ఎంతో మంది.. 2019 ఎన్నికల వేళలో వైసీపీ అధినేత.. ఆయన అనుచర వర్గం చెప్పిన మాటల్ని విని కూడా ఈ రోజున అడ్డదిడ్డమైన వాదనను వినిపించటం చూస్తున్నాం.

అమరావతి రాజధానిగా కంటిన్యూ చేస్తామని చెప్పినప్పుడు.. విశాఖ ఊసే లేదు. కానీ.. ఎప్పుడైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధాని కాదని ఫిక్స్ అయిన తర్వాత నుంచి ఆయన్ను అభిమానించే వారు.. ఆయనకు మద్దతుగా నిలవాలని భావించే వారంతా అమరావతి రాజధానిగా ఎందుకు అవసరం లేదు.. విశాఖనే రాజధానిగా ఎందుకు సూట్ అవుతుందన్న వాదనను వినిపించటం మొదలు పెట్టారు. ఇందుకోసం చరిత్రలోని కొన్ని ఘట్టాల్ని ఆధారంగా చేసుకొని.. వాటితో తమ వాదనను వినిపిస్తున్నారు.

అయితే.. ఇలాంటి వారంతా కూడా కొన్ని సాధారణ విషయాల్ని మాత్రం ఇసుమంత కూడా ప్రస్తావించరు. అందులో మొదటిది అమరావతి రాజధాని వద్దన్నారు సరే.. అమరావతి రాజధానిగా సరికాదన్నారు సరే.. మరి.. మాట తప్పని.. మడమ తిప్పని తమ అధినాయకుడే స్వయంగా అమరావతే ఏపీ రాజధాని అని చెప్పిన తర్వాత విశాఖ అని చెప్పాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంది.

విశాఖ వాసులకు రాజధాని కాంక్ష లేదన్న విషయాన్ని ఆ నగరవాసులు చెప్పే ప్రయత్నం చేస్తే.. వారి నోరు మూయించటానికి పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. అదేమంటే.. ఎవర్రా రాజధాని వద్దనేది అంటూ రంకెలు వేస్తూ.. నోరు విప్పే ప్రయత్నం చేస్తున్న వారికి.. తమ రంకెలతో వార్నింగ్ ఇవ్వటం కనిపిస్తోంది. నిజానికి.. ఇదే విశాఖ వాసులకు నచ్చనిది. తమ మానాన తాము ఉన్న వేళ.. తమకు సంబంధం లేని విషయాల్ని తమ మీద రుద్దేయటం.. దానికి తమ ఆమోదం ఉందన్న వాదనను వినిపించటాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు.

ఎవరు అవునన్నా.. కాదన్నా విశాఖకు రాజధాని హోదా లేనప్పటికీ కాస్మొపొలిటన్ నగరంగా భాసిల్లింది. దానికంటూ ప్రత్యేకమైన ఉనికి ఉంది. దాన్ని కాపాడుకోవటానికి వారు తపిస్తుంటారు. కానీ.. ఇప్పుడున్న సమస్యల్లా.. ఆ ప్రత్యేకతను సమాధి చేయటానికి.. తమ ఎజెండాను అమలు చేయటానికి విశాఖను పావులా వాడుకోవటాన్ని విశాఖ వాసులు అస్సలు ఇష్టపడటం లేదు. ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే.. వారి మీద విరుచుకుపడటం.. వారి వాదనలకు రంగులు అద్దటంతో.. ఎందుకొచ్చిన దరిద్రం అనుకొని మిన్నకుండిపోతున్న పరిస్థితి.

విశాఖ వాసులు రాజధాని ఎందుకు వద్దంటారు. వారు కోరుకుంటున్నారని వినిపించే వాదనలకు విశాఖ వాసులు మౌనంగా వినిపించే వాదనలు చాలానే ఉన్నాయి. అందులో మొదటిది.. దేశ ప్రజల్లో ఎవరికైనా రెండు ఆప్షన్లు ఇచ్చి.. అందులో ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో ఉండాలనుకుంటున్నారా? ముంబయిలోనా? అంటే.. ఓటు వేసేది ముంబయికే. అమెరికా రాజధాని వాషింగ్టన్, కానీ న్యూయార్క్ గా ఎదగాలని ఇతర నగరాల వారు ఎందుకు కోరుకుంటారు, ఎందుకు వాషింగ్టన్ లా ఉండిపోదామనుకోరు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. విశాఖ వాసులు రాజధాని అక్కర్లేదని ఎందుకు అంటారో ఇట్టే అర్థమైపోతుంది.

యాభై లక్షలు ఉన్న విశాఖను రాజధానిగా చేసేస్తే.. మహా విశాఖ కిందకు కోటి మంది జనాభా వచ్చేస్తారంటూ ఊరింపు మాటల్ని విన్నప్పుడు.. 2019 ఎన్నికల వేళలో అమరావతినే రాజధాని.. మేం అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తామన్న మూర్ఖుల మాటల్ని నమ్మొద్దు. మాకే ఓటు వేయండి.. బ్రహ్మాండమైన రాజధానిగా అమరావతిని నిర్మిస్తామంటూ ఊరించే మాటలు ఇట్టే గుర్తుకు రాక మానదు. ప్రశాంతంగా బతికేస్తున్న వారు.. తమకు ఆ ప్రశాంతత వద్దని.. జనాభాతో కిక్కిరిసిపోయే నగరాన్ని కోరుకుంటారా? అన్నది ప్రశ్న. ఐటీ, మెడిసిన్, సైన్స్ సిటీగా ఎదిగే అవకాశాన్ని వదిలేసి ఎవరైనా పొలిటికల్ సిటీగా మిగిలిపోదాం అనుకుంటారా?

విశాఖ వాసులు ఉక్కు నగరాన్ని రాజధానిగా చేయొద్దని ఎందుకు అనుకుంటారో తెలుసా? అంటూ అక్కడి వారు చెప్పే కొన్ని మాటల్ని వినాల్సిందే. తెలుగు వారికి బాగా తెలిసిన హైదరాబాద్.. చెన్నై.. విజయవాడ.. గుంటూరు లాంటి నగరాలు..పట్టణాల్ని పరిశీలించినప్పుడు కనిపించే కొన్నిసారూప్యతలకు భిన్నంగా విశాఖ నగరం ఉంటుంది. ఆ నగరం ఎప్పుడూ ఒకలాంటి ప్రశాంతతతో.. అందరినీ ఆహ్వానిస్తూ ఉంటుంది. ఆ నగరం ఎప్పుడూ వేడుకను తలపించేలా ప్రజలు ఉంటారు. తమ వద్దకు వచ్చి వెళ్లే వారికి అప్యాయతను అందిస్తుంటారు. అలా నవ్వుతూ.. తుళ్లుతూ ఉత్సాహంతో ఉరకలెత్తే నగరాన్ని రాజకీయ రాజధానిగా చేయటానికి పాలకులు సిద్ధం అవుతుంటే.. తమకు వద్దంటే వద్దని వాపోతున్నారు విశాఖ వాసులు.

దీనికి కారణం.. తమకు కావాల్సింది రాజకీయ రాజధాని కాదు. తమ మనసులకు దగ్గరగా ఉంటే టెక్నాలజీ రాజధాని కానీ.. ఐటీ రాజధాని కానీ.. టూరిజం రాజధాని కానీ కావాలి. అంతే తప్పించి.. రాజకీయ కేంద్రంగా మారి.. రాజకీయ ఎత్తుగడల్లో పావుల మాదిరి మారటానికి వారు ససేమిరా అంటున్నారు. అభిరుద్ది కావాలి హడావుడి వద్దంటున్నారు. అయితే.. వారి మాటల్ని మనసుతో కాకుండా.. రాజకీయ రంగుటద్దాలతో చూస్తూ.. పచ్చకామెర్ల వాడిని తలపించేలా వ్యవహరిస్తున్న వారిని చూసి విశాఖ వాసులు తలలు పట్టుకుంటున్నారు. మేం కోరుకోని పెళ్లి సంబంధం ఎంత పెద్దదైనా.. ఎంత తోపైనా తమకు వద్దంటే వద్దన్నా.. లేదు.. కుదరదు.. మీరు పెళ్లికి ఒప్పుకోవాలనే ఒత్తిడితో ఉన్న పెళ్లికుమార్తె మాదిరి విశాఖ మారిందన్న మాట అక్కడి ప్రజలకు దగ్గరగా వెళ్లినప్పుడు వారి మాటల్లో వేదన ఇట్టే అర్థమవుతుంది. అయినా సరే.. ఎదుటోడి వేదన కంటే తాము అనుకున్నది మాత్రం జరగాలనే మూర్ఖుల వాదనల్ని విని అలిసిపోతున్న విశాఖ వాసులు.. తమ మీద రాజధాని బండ వేయొద్దని కోరుకుంటున్నారు. మరి.. ఆ దేవుడేం చేస్తాడో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.