Begin typing your search above and press return to search.

మీరు.. లావు ఉన్నారా.. అయితే కరోనాతో జాగ్రత్త!

By:  Tupaki Desk   |   28 Aug 2020 1:00 PM IST
మీరు.. లావు ఉన్నారా.. అయితే కరోనాతో జాగ్రత్త!
X
గతంతో పోలిస్తే మారిన ఆహారపు అలవాట్ల నేపథ్యంలో దేశంలో ఒబెసిటీ బారిన పడుతున్న వారు ఎక్కువైపోయారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, స్వీట్స్, అధిక నూనె పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల చాలామంది లావైపోతున్నారు. కనీసం తిన్న ఆహారానికి తగ్గట్టుగా పనిచేయడమో, వ్యాయామం కానీ చేయడం లేదు. ఇతరులతో పోలిస్తే స్థూలకాయులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడడం ఎక్కువే. ఇలాంటి వారు బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులతో ఎక్కువగా బాధపడుతుంటారు. ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వీరికి వైద్య నిపుణులు మరో షాకిచ్చే విషయాన్ని వెల్లడించారు.

లావున్న వారు కరోనా బారిన పడితే 48 శాతం ఎక్కువ మరణించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు నియమించిన శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది. అధిక బరువు ఉన్నవారు 113 శాతం ఆసుపత్రిలో చేరే అవకాశం ఉండగా, వారిలో 74 శాతం మంది ఆక్సిజన్ వెంటిలేటర్లు ఆశ్రయించాల్సి వస్తుందని కూడా ఆ బృందం హెచ్చరించింది. బరువు ఉన్న వారు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారికి రక్తంలో షుగర్ పెరిగి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. వారి రక్తనాళాలు ఉబ్బి పెళుసుగా తయారవుతాయి. లావు అధికంగా ఉన్నవారిలో రోగ నిరోధక శక్తిని ఇచ్చే కణాలు కూడా బాగా దెబ్బతింటాయి. ఇలాంటి వారికి కరోనా వస్తే వెంటిలేటర్ చికిత్స కూడా కష్టమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి కారణాల వల్లే కరోనా బారిన పడితే వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం పలు దేశాల్లో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. వారి కష్టం ఫలించి తొందర్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అధిక బరువు ఉన్న వారికి వ్యాక్సిన్ అంతగా పని చేయకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లావున్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్లే వ్యాక్సిన్ వేసినా అంతగా ప్రభావం చూపదని వారంటున్నారు. మన దేశంతో పోలిస్తే బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో స్థూలకాయుల శాతం అధికంగా ఉంది. లావుగా ఉన్నవారు ఇకనైనా శాస్త్రవేత్తల సూచనల మేరకు కాస్తయినా సన్నబడితే ప్రయోజనం ఉంటుంది.