Begin typing your search above and press return to search.

మునుగోడులో ముంచేస్తున్నారా....?

By:  Tupaki Desk   |   10 Oct 2022 4:30 PM GMT
మునుగోడులో ముంచేస్తున్నారా....?
X
ఆయన అతి ఆశ ఇంతవరకూ పరిస్థితిని తీసుకువచ్చింది. సార్వత్రిక ఎన్నికలు ఏడాది దూరంలో ఉన్నాయనగా మునుగోడులో నిక్షేపం లాంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు తెర లేపారు. ఆయనే కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా ఉంటూ అన్నీ అనుభవించిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన బీజేపీలోకి ఎందుకు వెళ్లారు అన్న దానికి మునుగోడు జనాలకు ఈ రోజుకీ సరైన జవాబు చెప్పలేకపోయారు. అది ఇపుడు అతి పెద్ద మైనస్ గా మారుతోంది. దానికి తోడు మునుగోడు చరిత్రలో పన్నెండు సార్లు ఎన్నికలు జరిగితే ఎపుడూ కూడా బీజేపీ గెలిచింది లేదు.

ఇక కనీసం డిపాజిట్లు కూడా ఆ పార్టీ తెచ్చుకోలేని స్థితి. ఈ నేపధ్యంలో దుస్సాహసం చేసి కమలంతో కరచాలనం చేసిన రాజగోపాల్ రెడ్డికి ఇపుడు అసలైన సీన్ కళ్ల ముందు కనిపిస్తోందిట. మునుగోడులో అంతర్గత సర్వే చేసుకున్న బీజేపీ పెద్దలకు వాస్తవం అర్ధం కావడంతో ఆ వైపుగా ఇపుడు చూడడం లేదు అంటున్నారు. నిజానికి ఉప ఎన్నికలు అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొత్తం బీజేపీ యంత్రాంగం పెద్దలు అలా లాండ్ అయిపోయే సీన్ ఒకటి ఉంటుంది.

అదే దుబ్బాకలో, హుజూరాబాద్ లో కనిపించింది. కానీ మునుగోడులో అలాంటి పరిస్థితే అసలు లేదు అంటున్నారు. దానికి కారణం గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ముందే బీజేపీ వారికి అర్ధం కావడం. ఇక మునుగోడులో రాజీనామా చేసినా రాజగోపాల్ రెడ్డికి ఏ కోశానా సానుభూతి అన్నది లేకపోవడంతో బీజేపీ పెద్దలు ముఖం చాటేస్తున్నారా అన్న చర్చ వస్తోందిట.

ఇక రాజగోపాల్ రెడ్డి తాను రాజీనామా చేస్తే తన వెంట కాంగ్రెస్ క్యాడర్ మొత్తం వచ్చి చేరుతుందని ఆశపడినా నూటికి ఇరవై మంది కూడా చేరలేదు అని అంటున్నారు. దాంతో ఆయన డీలా పడ్డారని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా కసిగా మునుగోడు ఎన్నికల్లో పోరాడుతోంది. అధికార టీయారెస్ ఎటూ దూకుడు చేస్తోంది. ఈ నేపధ్యంలో మునుగోడులో బీజేపీ ప్లేస్ ఏంటి అన్నది కూడా తెలియడంలేదు అంటున్నారు. మునుగోడు విషయంలో ఫలితం మీద డౌట్ కొట్టబట్టే పెద్ద నాయకులు రావడం లేదని గుసగుసలు పోతున్నారు.

నిజానికి హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు వస్తే కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చి హడావుడి చేశారు. కానీ మునుగోడు విషయంలో మాత్రం ఒక్క సభ పెట్టి మమ అనిపించేశారు. ఇపుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మునుగోడు మీద ఫోకస్ పెట్టడంలేదు, బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ కూడా ఆ వైపునకు చూడడంలేదు అంటున్నారు. మొత్తం మీద మునుగోడులో రాజగోపాల్ రెడ్డిది ఒంటరి పోరు అయిందా అన్న చర్చ సాగుతోందిట. ఇవన్నీ చూస్తూంటే మొట్టమొదట్లోనే గెలిచి తీరుతామని జబ్బలు చరచిన బీజేపీ మునుగోడులో మునుగుతుందా తేలుతుందా అన్న చర్చ అయితే వాడిగా వేడిగా సాగుతోంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.