Begin typing your search above and press return to search.

తనను తానే మోసం చేసుకుంటున్నారా ?

By:  Tupaki Desk   |   15 Aug 2022 4:57 AM GMT
తనను తానే మోసం చేసుకుంటున్నారా ?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా మాటలు విన్న తర్వాత ఎంత అయోమయంలో ఉన్నారో అర్ధమైపోతోంది. పార్టీ ఐటి విభాగం కార్యకర్తలతో మాట్లాడుతు అధికారం కోసమో లేకపోతే పదవుల కోసమో తాను పార్టీ పెట్టలేదని చెప్పారు. తాను పార్టీ పెట్టింది ఒక తరాన్ని నిద్రలేపటానికట. పార్టీపెట్టింది ఒక తరానికి బాధ్యతను గుర్తుచేయటానికని చెప్పారు. ఆ స్ధోమత ఉంటే ప్రజల కచ్చితంగా మనకు అవకాశం ఇస్తారన్నారు.

పవన్ మాటలు విన్న తర్వాత తనని తాను మోసం చేసుకుంటున్నారేమో అనే అనుమానం పెరిగిపోతోంది. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు అధికారం కోసం కాదని చెప్పారంటే కచ్చితంగా తమను మోసం చేస్తున్నారనే జనాలు అనుకుంటారు. ఎందుకంటే పదవులు వద్దంటే, అధికారం అవసరం లేదని అనుకుంటే అసలు రాజకీయాలజోలికే రారు. ఏదో స్వచ్ఛంధ సేవ పెట్టుకుని తమకు వీలైనంత సేవ చేసుకుంటారంతే.

కానీ పవన్ మాటలు పరస్సర విరుద్ధంగా ఉంటున్నాయి. ఒకసారేమో పదవులకోసం అధికారంకోసం రాజకీయాల్లోకి రాలేదంటారు. మరోసారి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికార జనసేనదే అంటారు. వైజాగ్ లో మాట్లాడినపుడు తనను జనాలు రెండు నియోజకవర్గాల్లోను ఓడించారని తెగబాధపడిపోయారు.

ఇంకోసారి అధికారం లేకపోతే జనాలకు ఏమీ చేయలేమన్నారు. ఒక్కోసారి ఒక్కోమాట మాట్లాడుతున్న పవన్ పూర్తిగా అయోమయంలో ఉన్నారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ప్రతి సభలోను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న పవన్ కు జనాలు ఎలా ఓట్లేస్తారు ? రాజకీయాల్లోకి తాను ఎందుకొచ్చాను అనే విషయంలో ముందు పవన్ కే క్లారిటీ లేనపుడు ఇక జనసేన విషయంలో జనాలకు మాత్రం క్లారిటీ ఏముంటుంది.

జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ను చూసైనా పవన్ రాజకీయం నేర్చుకున్నట్లు లేదు. వాళ్ళిద్దరు 24 గంటలూ రాజకీయాలే చేస్తుంటారు. అధికారం కోసమే, పదవుల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళే కాదు నరేంద్రమోడీ, స్టాలిన్, బొమ్మై, రాహుల్ గాంధీ ఇలా ఎవరిని తీసుకున్నా అధికారం సాధించటానికి వచ్చారు. మరి వాళ్ళకన్నా పవన్ ఏ విధంగా భిన్నం ?