Begin typing your search above and press return to search.

టీసీఎస్ కు మహిళా ఉద్యోగులు దూరమవుతున్నారా? కారణం ఇదేనట

By:  Tupaki Desk   |   8 Jun 2023 3:00 PM GMT
టీసీఎస్ కు మహిళా ఉద్యోగులు దూరమవుతున్నారా? కారణం ఇదేనట
X
దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటిగా పేర్కొనే టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. సాధారణంగా ఐటీ కంపెనీల్లో.. అందునా దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల విషయంలో మగ.. ఆడ ఉద్యోగుల మధ్య నిష్పత్తి దాదాపుగా సమానం.. లేదంటే మగవారి కంటే మహిళా ఉద్యోగులు కాస్తంత తక్కువగా ఉండటం కనిపిస్తుంది. కానీ.. టీసీఎస్ లో మాత్రం ఈ మధ్యన మహిళా ఉద్యోగుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్న విషయాన్ని గుర్తించారు.

ఎందుకిలా? విలువలు ఉన్న సంస్థగా.. తలనొప్పులు తక్కువగా ఉండే ఈ దిగ్గజ ఐటీ కంపెనీకి మహిళా ఉద్యోగులు ఎందుకు దూరం అవుతున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. వర్కు ఫ్రం హోం వసతిని నిలిపేసి.. ఉద్యోగులంతా కచ్ఛితంగా ఆఫీసుకు రావాల్సిందే అన్న నిర్ణయాన్ని తీసుకోవటమే కారణమని చెబుతున్నారు. తమ సంస్థలో మగవారితో పోలిస్తే మహిళా ఉద్యోగుల వలసలు ఎక్కువగా సాగుతున్న విషయాన్ని వెల్లడించింది.

టీసీఎస్ లో మొత్తం ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షలు కాగా.. అందులో మహిళా ఉద్యోగుల సంఖ్య 35 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. అయితే.. మహిళా ఉద్యోగులకు.. మగ ఉద్యోగులకు మధ్య పెరిగిన అంతరాన్ని ఆ సంస్థ బయటకు వెల్లడించలేదు. సిబ్బంది మొత్తం వలసల రేటు గత ఆర్థిక సంవత్సరం మధ్యలో గరిష్ఠ స్థాయికి చేరిందని.. మార్చి చివరకు 20 శాతానికి దిగి వచ్చినట్లుగా సంస్థ వెల్లడించింది.

అనుభవం ఉండి.. విరామం తర్వాత మళ్లీ ఉద్యోగంలోకి చేరేందుకు వీలుగా సంస్థ మొదలు పెట్టిన రీబిగినింగ్ కార్యక్రమంలో 2022-23లో సుమారు 14వేల అప్లికేషన్లు వచ్చాయని.. ఉన్నత యాజమాన్య విభాగంలో సుమారు 30వేల మంది ఉద్యోగులు ఉంటే.. వీరిలో 4వేల మంది మహిళా ఉద్యోగులు ఉంటారని చెబుతున్నారు. అప్లికేషన్ల ద్వారా నియమితులైన మహిళ సంఖ్య 14 శాతమేనని తెలుస్తోంది. ఇక.. 2022-23లో నెట్ అపాయింట్ మెంట్ల విషయానికి వస్తే మహిళల సంఖ్య 38.1 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు.