Begin typing your search above and press return to search.

ఈ వర్గాలే ఏపీలో పాలిటిక్స్ ని మార్చేస్తాయట.... ?

By:  Tupaki Desk   |   28 Feb 2022 12:30 PM GMT
ఈ వర్గాలే ఏపీలో పాలిటిక్స్ ని మార్చేస్తాయట.... ?
X
ఏపీలో ఎన్నికలు రాజకీయం దీని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జగన్ చేతిలో ఇంకా రెండేళ్లకు పైగా అధికారం ఉన్నా కూడా 2024లో ఆయన్ని ఎలా ఓడించాలి అన్న దాని మీద విపక్షాలు పెద్ద కసరత్తునే చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అయితే జగన్ కి కలసి వచ్చే అంశాలు ఏవీ, నెగిటివ్ గా పనిచేసే విషయాలు ఏవీ అన్న దాని మీద అతి పెద్ద రిసెర్చ్ నే చేస్తోంది.

ఏపీలో ఏం జరిగినా జరగకపోయినా సంక్షేమ పధకాలు అయితే సవ్యంగానే సాగిపోతున్నాయి. ఈ విషయంలో మాత్రం ఎవరైనా అంగీకరిస్తున్నారు. జగన్ కూడా ఈ విషయంలో గట్టిగానే ఉన్నారు. తనకు అవే శ్రీరామరక్షగా ఆయన భావిస్తున్నారు. ఒక విధంగా రేపటి ఎన్నికల కోసం ఓట్ బ్యాంక్ గా వాటిని మార్చుకోవాలనుకుంటున్నారు.

వివిధ వర్గాలకు పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నందువల్ల కచ్చితంగా తమకు ఓట్ల రూపంలో వాటి ఫలితాలు వస్తాయని జగన్ సహా వైసీపీ నేతలు అంతా భావిస్తున్నారు. అందుకే వారు పదే పదే జగనే మళ్లీ సీఎం అని కూడా చెబుతున్నారు. అయితే సంక్షేమ పధకాలే ప్రతీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తే ఏ నాయకుడూ ఎపుడూ ఓడిపోరు. మరి వాటికి మించినవి కూడా చాలా ఉంటాయన్నది టీడీపీ వాదన.

ఇక సంక్షేమ పధకాలు అని గొప్పగా వైసీపీ చెప్పుకుంటున్నా ఆ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో ఓటు వేయరని కూడా అంటున్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో వివిధ రకాలైన పన్నుల రూపంలో సర్కార్ లాగేసుకుంటోంది కాబట్టి వారిలో కూడా ఏకమొత్తంగా ఓటు పడదని టీడీపీకి కచ్చితమైన లెక్కలు ఉన్నాయట.

మరో వైపు మధ్యతరగతి వర్గాలు, ఉన్నత వర్గాలు, విద్యావంతులు ఇలా చాలా సెక్షన్లలో వైసీపీ సర్కార్ మీద పూర్తి వ్యతిరేకత ఉందని టీడీపీ తరచూ చేస్తున్న సర్వేలలో తెలుస్తోందిట. అందుకే వారిని ఈసారి గట్టిగా టార్గెట్ చేస్తారు అంటున్నారు. మామూలుగా ఈ వర్గాలు ఎపుడూ ఓటింగునకు పెద్దగా హాజరు కావు. వారు ఎంత సేపూ సర్కార్ విధానాలను రచ్చ బండ మీద చర్చ పెట్టి విమర్శించమంటే చాలా బాగా చేస్తారు కానీ మార్పు కొరకు పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటు వేయరు.

అలా చేయడం వల్లనే ప్రతీ ఎన్నికలోనూ సరైన ఫలితం రావడం లేదు అన్న మాట ఉంది. అయితే ఈసారి అలా కాకుండా ఒక్క ఓటూ పొల్లుపోకుండా చూడాలని టీడీపీ సహా విపక్షాలు గట్టి పట్టుదల మీద ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో ఉన్నత మధ్యతరగతి వర్గాలు పెద్ద ఎత్తున ఓటింగు చేస్తే కనుక వైసీపీ సర్కార్ కి పూర్తి ఇబ్బంది రావడం ఖాయమని అంటున్నారు. అదే టైమ్ లో గతంలో ఎన్నడూ చూడని ఫలితాలు కూడా వస్తాయని చెబుతున్నారు. మరి ప్రభుత్వ విధానాలను ఎపుడూ విమర్శించడమేనా. చేయి చేసుకుని సర్కార్ ని మార్చే సీన్ ఏమైనా ఈ వర్గాలలో ఉందా. చూడాలి మరి ఏం జరుగుతుందో.