Begin typing your search above and press return to search.

బీజేపీ ప్ర‌భుత్వం ప్రైవేటీక‌రించే బ్యాంకులు ఇవేనా?

By:  Tupaki Desk   |   17 March 2021 5:30 PM GMT
బీజేపీ ప్ర‌భుత్వం ప్రైవేటీక‌రించే బ్యాంకులు ఇవేనా?
X
ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ప్రైవేటీక‌రించ‌డ‌మే త‌మ విధాన‌మంటూ బాహాటంగా ప్ర‌క‌టించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. దేశంలోని ప‌లు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను ప్రైవేటు అమ్మేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశామంటూ పార్ల‌మెంటులో ప్ర‌క‌టించారు ఆర్థిక మంత్రి. అయితే.. కేంద్రం ప్రైవేటు వాళ్ల‌కు అమ్మేయ‌బోతున్న సంస్థ‌ల్లో ప్ర‌భుత్వ బ్యాంకులు కూడా ఉన్నాయి.

ఈ నిర్ణ‌యంపై బ్యాంకు ఉద్యోగులు క‌న్నెర్ర చేశారు. బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌ను నిర‌సిస్తూ మూడు రోజుల‌పాటు దేశ‌వ్యాప్తంగా స‌మ్మె చేప‌ట్టారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఉద్యోగుల సంఘం ‘యునైటెడ్ ఫోరం ఆప్ బ్యాంక్ యూనియన్’ ఆధ్వ‌ర్యంలో ఉద్యోగులు ఆందోళ‌న చేప‌ట్టారు. మొత్తం తొమ్మిది సంఘాల ప‌రిధిలోని ఈ స‌మ్మెలో పాల్గొన్నారు.

ఈ ఏడాది రెండు బ్యాంకులతోపాటు, ఒక జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ కంపెనీని కూడా ప్రైవేటు ప‌రం చేస్తామ‌ని ఆర్థిక మంత్రి బ‌డ్జెట్ ప్ర‌సంగంలో చెప్పారు. అయితే.. ఈ బ్యాంకుల్లో మొత్తం వాటాను అమ్మ‌బోతున్నారా? కొంత ఉపసంహరించుకోబోతున్నారా? అన్న‌ది మాత్రం కేంద్రం వెల్ల‌డించ‌లేదు.

అయితే.. మొత్తం నాలుగు బ్యాంకుల‌ను అమ్మేసేందుకు కేంద్రం ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఉద్యోగ‌ సంఘాలు చెబుతున్నాయి. ఇందులో ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంక్‌, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర ఉన్నాయ‌ని నేత‌లు చెబుతున్నారు. ఈ నాలుగు బ్యాంకుల ప‌రిధిలో దాదాపు ల‌క్షా 30 వేల మంది సిబ్బంది ప‌నిచేస్తున్నారు.

ఈ బ్యాంకుల‌ను ప్రైవేటు ప‌రంచేస్తే.. త‌మ భ‌విష్య‌త్ ఏంట‌ని ఉద్యోగులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు. ప్రైవేటు వాళ్లు కొనుగోలు చేస్తే.. ఏం జ‌రుగుతుందో తెలిసిందే. వారు ఇచ్చే జీతానికి ప‌నిచేయాలి. చెప్పిన‌ట్టుగా ప‌నిచేయాలి. హ‌క్కులు అనేవి ఏవీ ఉండ‌వు. గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తే ఉద్యోగం ఊడ‌దీస్తారు. కాబ‌ట్టి.. ప్రైవేటు ప‌రం చేయ‌డానికి ఒప్పుకునేది లేదంటూ ఉద్యోగులు ఆందోళ‌న చేస్తున్నారు.