Begin typing your search above and press return to search.

టీడీపీ నుంచి వైసీపీలోకి పోయిన ఎమ్మెల్యేలు కోల్డ్ స్టోరేజ్ గా మిగిలిపోతున్నారా?

By:  Tupaki Desk   |   13 May 2021 6:00 PM IST
టీడీపీ నుంచి వైసీపీలోకి పోయిన ఎమ్మెల్యేలు కోల్డ్ స్టోరేజ్ గా మిగిలిపోతున్నారా?
X
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు జంప్ కొట్టడం సర్వసాధారణమైన విషయం. ఏపీలో కూడా అలాంటిదే మొదట్లో జరిగింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వివిధ కారణాలతో నలుగురు ఎమ్మెల్యేలు తొలుత జంప్ అయ్యారు. ఇంకా జంప్స్ ఉంటాయని అనుకున్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేల తాకిడి మొదలైంది. వైసీపీలోకి వచ్చే టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించారు. ఎమ్మెల్యేలు తగినంత మంది వస్తే టీడీపీ శాసనసభపక్షం లేకుండా చేయాలన్న ఆలోచనతో తొలినాళ్లలో అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ జగన్ ఆలోచనకు అనుగుణంగా ప్లాన్ వర్కవుట్ కాలేదు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ మాత్రమే వైసీపీకి మద్దతుగా నిలిచారు. అంటే 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురు మాత్రమే వైసీపీ వైపు మళ్లారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్లు కూడా వినిపించాయి.

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ కంపెనీలపై కూడా దాడులు జరిపి భారీగా జరిమానాలు విధించారు. అయినా హైకోర్టుకు వెళ్లి వ్యాపారాలను రక్షించుకున్నారే తప్ప వైసీపీ వైపు రాలేదు. ఏలూరి సాంబశివరావు పరిస్థితి కూడా అంతే. ఇక పార్టీలోకి వచ్చే వాళ్లలో గంటా శ్రీనివాసరావు పేరు ఒక్కటే వినిపిస్తోంది. అయితే ఆయన రాకకు అనేక ఇబ్బందులు ఉండటంతో ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లుగా సమాచారం. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేరు కూడా వైసీపీలో చేరుతారని ప్రచారం బాగా జరుగుతోంది. కానీ ఆయన రాకకు కూడా బ్రేకులు పడ్డాయని చెబుతున్నారు. మొదట్లో టీడీపీలోని ఎమ్మెల్యేలను తీసుకోవడానికి ఉత్సాహం చూపిన వైసీపీ అధిష్టానం ఇప్పుడసలు చేరిన వారిని కూడా పట్టించుకోవడం లేదన్న ఆవేదన వారిలో ఉంది.

అయితే వైసీపీలోకి అధికారికంగా చేరకుండానే ఆ పార్టీకి మద్దతుగా చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. అటు టీడీపీకి దూరంగా ఉంటూ వైసీపీకి దగ్గరగా ఉంటున్నారు. అలా టీడీపీలోని చాలా మంది ఇప్పుడు వైఎస్ జగన్ కు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. మొదట్లో వారికి ప్రాధాన్యం దక్కినా ఇప్పుడు అంతగా దక్కడం లేదట..

టీడీపీ నుంచి వైసీపీలోకి కొందరు ఎమ్మెల్యేలు అనధికారికంగా కండువ కప్పుకోకుండా జంప్ అయ్యారు. అయితే మొదట్లో కొంచెం బాగున్నా ఇప్పుడు వారి పరిస్థితి బాగా లేదు అంట.. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో ఉన్న పాత వర్గాలను ఆ జిల్లా మంత్రులు ప్రోత్సహిస్తున్నారట.. జంప్ అయిన ఎమ్మెల్యేలను తొక్కేస్తున్నారంట.. హైకమాండ్ ఈ బాధ చెప్పుకోవాలని చూస్తే అపాయింట్ మెంట్ దొరకడం లేదు అంట.. లాస్ట్ కు మేము అటు ఇటూ కాకుండా కోల్డ్ స్టోరేజ్ కేనా అని ఎమ్మెల్యేలు భయపడుతున్నారట..

ఇలా రెంటికి చెడ్డ రేవడిలా వైసీపీలోకి జంప్ అయిన టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి తయారైందట. ఇప్పుడు అటు ప్రభుత్వంలో పనులు కాక.. ఇప్పుడు బయట చేయడానికి ఏం లేక.. పరపతి లేక ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల పరిస్థితి తీసికట్టుగా మారిందట..