Begin typing your search above and press return to search.

జీతాలు రెడీ అవుతున్నాయా ?

By:  Tupaki Desk   |   29 Jan 2022 5:39 AM GMT
జీతాలు రెడీ అవుతున్నాయా ?
X
ఒకవైపు ఉద్యోగుల సమ్మె. మరోవైపు జీతాలు అందుకునే తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. ఈ నేపధ్యంలో ఉద్యోగులకు అసలు జీతాలు పడతాయా పడవా ? రిటైర్డ్ ఉద్యోగుల పరిస్ధితి ఏమిటి ? పెన్షన్ వస్తుందా రాదా అనే విషయంలో ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం కొందరు ఉద్యోగులకు జీతాలు ఫిబ్రవరి 1, 2 తేదీల్లో వేయటానికి బిల్లులు రెడీ అవుతున్నాయని సమాచారం. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ వేయటానికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుస్తోంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 1.5 లక్షల మంది ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు అందుతాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ట్రెజరీ ఉన్నతాధికారులు, ఉద్యోగు రెడీచేస్తున్నారు. ట్రెజరీ ఉద్యోగులు కూడా మిగిలిన ఉద్యోగుల సమ్మెలో భాగమే అయినప్పటికీ ఇప్పటికే జీతాల కోసం తమ దగ్గరకు వచ్చిన బిల్లులను సర్వేసు నిబంధనల ప్రకారం ఆపేందుకు లేదు. ఈ కారణంతోనే ట్రెజరీ అధికారులు బిల్లుల ప్రాసెస్ మొదలుపెట్టారు.

ట్రెజరీ అధికారులకు వచ్చిన బిల్లుల్లో అత్యధికం పోలీసు శాఖ ఉద్యోగులదే అని తెలుస్తోంది. ఇతరత్రా వేరే శాఖల ఉద్యోగులు కూడా కొందరు బిల్లులు పెట్టేసుకున్నారు. ఎందుకంటే సమ్మె ఎన్నిరోజులు జరుగుతుందో ? ప్రభుత్వం దిగిరాకపోతే ఏమి చేయాలో అన్న టేన్షన్ తో కొందరు ఉద్యోగులు కూడా తమ డ్రాయింగ్ అధికారి సంతకంతో జీతాల బిల్లులను ట్రెజరీలకు అందించినట్లు సమాచారం. ఆదివారం సెలవుదినమైనా అవసరమైతే పనిచేయాల్సుంటుందని ట్రెజరీ అధికారులకు ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయట.

ఇక రిటైర్డ్ ఉద్యోగులందరికీ పెన్షన్ వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ కారణంగా అయినా ట్రెజరీ ద్వారా బిల్లులు ప్రాసెస్ కాకపోయినా ఫైనాన్స్ శాఖలోని కాంపర్ హెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్) విధానంలో రిటైర్డ్ వాళ్ళకు మాత్రం పెన్షన్ వేసేసే సౌకర్యం ఎలాగు ఉంది. అయినా పెన్షన్ల బిల్లులను కూడా ట్రెజరీ అధికారులు రెడీచేస్తున్నారు. సమ్మె మరో నాలుగు రోజులు కంటిన్యు అయితే మరికొంతమంది ఉద్యోగులు కూడా జీతాల బిల్లులను సప్లిమెంటరీ బిల్లుల రూపంలో అందించే అవకాశాలున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. మరి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు, పెన్షన్లు పడితే కానీ జీతాలు, పెన్షన్లు తగ్గాయో పెరిగాయో తెలీదు.