Begin typing your search above and press return to search.

జైల్లో అనంతబాబుకు రాచ మర్యాదలు జరుగుతున్నాయా?

By:  Tupaki Desk   |   4 Jun 2022 7:30 AM GMT
జైల్లో అనంతబాబుకు రాచ మర్యాదలు జరుగుతున్నాయా?
X
తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో అరెస్టు అయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఉన్న అనంతబాబుకు అక్కడ రాచ మర్యాదలు అందుతున్నాయని సమాచారం. కోరిన ఆహారం తెప్పించుకోవడంతోపాటు జైలుకు వచ్చిన రెండు రోజే ఆయనకు జైలు గదిలో పరుపు వేశారని చెబుతున్నారు.

అలాగే జైలు గదిలో వాస్తవానికి ముగ్గురు ఖైదీలు ఉండాల్సి ఉండగా అనంత్ బాబు ఒక్కడినే ప్రత్యేకంగా ఉంచినట్టు తెలుస్తోంది. జైలుకు వచ్చిన మొదటి రోజే వైఎస్సార్సీపీ పార్టీ ముఖ్య నేతలు, ఉన్నతాధికారుల నుంచి జైలు అధికారులకు ఉన్నత ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. అనంత్ బాబుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ పెద్దలు ఆదేశించినట్టు చెప్పుకుంటున్నారు.

అలాగే అనంత్ బాబు జైలుకు వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలు రోజూ కలుస్తున్నారు. వాస్తవానికి ములాఖత్ పేరుతో అనంత్ బాబు కుటుంబ సభ్యులు, న్యాయవాదికి మాత్రమే ఆయనను కలిసే అవకాశం ఉంది. అది కూడా కోర్టు నియమ నిబంధనల మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే.. అనంత్ బాబు అధికార పార్టీ ఎమ్మెల్సీ కావడంతో జైలులో ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే అనంత్ బాబును రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి వచ్చి కలిశారు. అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్య నేతలు వచ్చి అనంత్ బాబుతో మాట్లాడారు.

మరోవైపు అనంతబాబుకు ప్రత్యేక ఆహారం అందిస్తున్నారని తెలుస్తోంది. కాగా అనంత్ బాబు జైలుకు వెళ్లినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని చెప్పుకుంటున్నారు. ఒక తోటి ఖైదీతో గొడవ పడి అతడి చెంప మీద కొట్టారని సమాచారం. తోటి ఖైదీతో మాటామాటా పెరగడంతో అతడి మీద అనంత్ బాబు చేయి చేసుకున్నారని అంటున్నారు.

అయితే ఆ ఖైదీకి గాయాలు కాకపోవడంతో ఆస్పత్రికి తరలించలేదని చెబుతున్నారు. ఒకవేళ ఖైదీని ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు పోలీసు ఫిర్యాదు అడుగుతారు. దీంతో గొడవ బయటపడే అవకాశం ఉందని.. ఫిర్యాదు చేయలేదని అంటున్నారు. అలాగే ఆ ఖైదీకి గాయాలు కూడా కాకపోవడంతో గొడవను సద్దుమణిగేలా చేశారని తెలుస్తోంది.

కాగా అనంత్ బాబుకు రిమాండ్ 10వ తేదీతో రిమాండ్ ముగియనుంది. దీంతో ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఆయన జైలుకొచ్చిన రెండో రోజే కస్టడీకి తీసుకుని విచారించాల్సి పోలీసులు ఆ పనిచేయకుండా ఇప్పుడు కస్టడీలోకి తీసుకుంటామని చెబుతుండటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులే ఈ కేసును నీరు గారుస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ అనంత్ బాబు ఈ కేసులో తనకు బెయిల్ కావాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పడీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.