Begin typing your search above and press return to search.

రాష్ట్ర మంత్రుల్ని ముంబై పోలీసులు అలా చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   27 March 2021 11:00 PM IST
రాష్ట్ర మంత్రుల్ని ముంబై పోలీసులు అలా చేస్తున్నారా?
X
గడిచిన కొద్ది రోజులుగా ముంబయి పోలీసులు కేంద్రం పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్లుగా ఒక రాష్ట్ర పోలీసులకు సంబంధించి సంచలన అంశాలు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే కరోనాతో తల్లడిల్లుతున్న మహారాష్ట్రలో.. అధికార పార్టీకి చెందిన మంత్రులపై ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని పోలీసు ఉన్నతాధికారులు సంధించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా రాజకీయ నేతల్ని టార్గెట్ చేసేందుకు పార్టీలు ప్రత్యేక వ్యూహాల్ని అమలు చేస్తుంటాయి. అందుకు భిన్నంగా మహారాష్ట్రలో మాత్రం ప్రభుత్వంలో కీలకమైన మంత్రుల్ని బీజేపీలోకి లాగేందుకు ఉన్నత స్థాయి పోలీసు అధికారులు రంగంలోకి దిగారని.. తమను కమలం పార్టీలో చేరాలని చెబుతున్నట్లుగా ఆరోపిస్తున్నారు.

మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేంద్ర పాటిల్ మాట్లాడుతూ.. 2019లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తనను బీజేపీలోకి లాగేందుకు రాష్ట్ర మాజీ ఇంటిలిజెన్స్ కమిషనర్ రష్మీ శుక్లా ప్రయత్నించారన్న బాంబు పేల్చారు. ఆయన ఆరోపణల ప్రకంపనలు ఒక కొలిక్కి రాక ముందే మరో ఇద్దరు మంత్రులు సైతం ముంబయి పోలీసుల మీద తీవ్ర ఆరోపణలు చేశారు.

దాదాపు డజను మంది ఎమ్మెల్యేల్ని.. చిన్నపార్టీ నేతల్ని బీజేపీ వైపునకు లాగేందుకు ముంబయి పోలీసులు అనేక ప్రయత్నాలు చేసినట్లు వారు చెప్పారు. రాష్ట్రంలో ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పడేందుకు వారు విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. తమను బీజేపీలోకి లాగేందుకు ఎమ్మెల్యేల్ని పోలీసు అధికారులు సంప్రదించిన విషయం తమకు తెలుసని.. ఇదే విషయాన్ని అప్పుడు పార్టీ చీఫ్ శరద్ పవార్ ముందుకు తీసుకెళ్లినట్లుగా ఎన్సీపీ మంత్రులు చెబుతున్నారు.

మొదట్నించి ఎన్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న యాద్రాకర్.. 2019లో జరిగిన ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా సీటు లభించలేదు. దీంతో.. అతను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం అప్పటి పోలీసు ఉన్నత అధికారిణి ఱస్మీ శుక్లా తనకు కబురు పంపారని..టీ తాగేందుకు ఆఫీసుకు రావాలని కోరారన్నారు. తాను ఇండిపెండెంట్ అభ్యర్థిని కావటంతో బీజేపీలోకి చేరేందుకు అవకాశం ఉందని ఆమె భావించారని.. పార్టీలోకి రావాలని.. సంపన్నుడివి అవుతావని ఆశ చూపించారన్నారు.

అయితే.. తాను ఆఫీసుకు వెళ్లకుండా తన తరఫు మనిషిని పంపానని.. ఆమె ప్రతిపాదనను రిజెక్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తన ఓటర్లు తనను 30వేల మెజార్టీతో గెలిపించారని.. వారంతా తనను శివసేనలో చేరాలని కోరటంతో తాను ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు. 2019లో మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ లేదు. ఫడ్నవీస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రత్యర్థి పార్టీలను చీల్చలేకపోవటం.. అనూహ్యంగా భిన్నధ్రువాలుగా ఉన్న శివసేన.. ఎన్సీపీ.. కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. తాజాగా.. పోలీసుల్ని అస్త్రాలుగా సంధించి ఆపరేషన్ ఆకర్ష్ కోసం ప్రయత్నించిన వైనం నేతలు వెల్లడించటంతో కమలనాథులు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి.