Begin typing your search above and press return to search.

చైనా సంప‌న్నులు ఆ దేశం వెళ్లిపోవ‌డానికి కార‌ణాలివేనా?

By:  Tupaki Desk   |   2 Sept 2022 8:00 AM IST
చైనా సంప‌న్నులు ఆ దేశం వెళ్లిపోవ‌డానికి కార‌ణాలివేనా?
X
ప్ర‌పంచంలో బిలియ‌నీర్లు (వంద‌ల కోట్ల సంప‌ద‌) అత్యధికంగా గ‌ల దేశాల్లో చైనా ఒక‌టి. అలాంటిది ఆ దేశంలో ఇటీవ‌ల కాలంలో వ‌ల‌స వెళ్లే బిలియ‌నీర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ దేశం తీసుకుంటున్న చ‌ర్య‌లే ఇందుకు కార‌ణ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. స్వేచ్చా వాణిజ్య విధానాలు లేక‌పోవ‌డం, ప్ర‌భుత్వానికి అనుకూలంగా లేక‌పోతే వేధించ‌డం, వ్యాపారాల‌ను దెబ్బ‌తీయ‌డం, అక్ర‌మ కేసులు మోప‌డం వంటి చ‌ర్య‌ల‌తో బిలియ‌నీర్లు వ‌ల‌స పోతున్నారు.

ఇలా వ‌ల‌స పోయేవారికి సింగ‌పూర్ ఆశాకిర‌ణంగా క‌నిపిస్తోంది. చాలామంది చైనా బిలియనీర్లు సింగ‌పూర్‌కు వెళ్లిపోతున్నారు. సింగ‌పూర్‌లో చైనీయులు, భార‌తీయులే అత్య‌ధికంగా ఉండ‌టం ఇక్క‌డ గ‌మనార్హం. ఓ వైపు కరోనాతో లాక్ డౌన్‌ల మీద‌ లాక్‌డౌన్‌లు.. మరోవైపు తైవాన్‌ ఉద్రిక్తతలు.. చైనా ప్ర‌భుత్వం పారిశ్రామిక‌వేత్త‌ల‌పై దుందుడుకు చ‌ర్య‌ల‌కు దిగడం వంటి కార‌ణాల‌తో సింగ‌పూర్‌కు చైనా బిలియ‌నీర్లు వ‌ల‌స వెళ్లిపోతున్నారు.

చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ స‌ర్కార్ చ‌ర్య‌ల‌తో వ‌ణికిపోతున్న చైనా బిలియ‌నీర్లు ప‌క్క‌నే ఉన్న‌ సింగపూర్ కు పోతున్నారు. కొందరు కొంతకాలం ఉండేలా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అయితే చాలామంది మాత్రం పూర్తిగా సింగపూర్‌లోనే సెటిల్‌ కావాలనే ప్లాన్‌తో ఉన్నారు.

త‌క్కువ ప‌న్నులు, స్వేచ్ఛా వాణిజ్య విధానాలు, త్వ‌రిత‌గతిన ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌త‌లు ఇవ్వ‌డంలో సింగ‌పూర్ ప్ర‌పంచంలోనే టాప్ దేశాల్లో ఒక‌టిగా ఉంది. విదేశీ పెట్టుబడుల‌ను ఆక‌ర్షించ‌డంలోనూ, పెట్టుబ‌డిదారుల మ‌న‌సు చూర‌గొన‌డంలోనూ సింగ‌పూర్ బెస్ట్ కంట్రీగా నీరాజ‌నాలందుకుంటోంది.

వాస్త‌వానికి సింగ‌పూర్ పేరుకు వేరే దేశ‌మైనా ఇక్క‌డ అత్య‌ధికులు చైనీయులు, భార‌తీయులే. సింగపూర్ జనాభా 53 లక్షలు కాగా.. అందులో రెండింట్లో మూడోవంతు చైనీయులే కావ‌డం గ‌మ‌నార్హం. ఒకవేళ అక్కడికి వెళ్లినా.. సొంత దేశాన్ని వీడిన భావ‌న ఉండ‌దు. అందుకే ఎక్కువ మంది సింగపూర్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో చైనా సంపన్నులను ఆక‌ట్టుకునేందుకు సింగపూర్ సర్కార్‌ కూడా చ‌ర్య‌లు చేప‌డుతోంది.

సింగ‌పూర్‌లో కూడా చైనీయులే అత్య‌ధిక పెట్టుబడులు పెట్టారు. జీరో కోవిడ్ అంటూ చైనా సర్కార్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు, ప‌దే ప‌దే లాక్‌డౌన్ విధించ‌డం.. తైవాన్‌ పరిణామాలతో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇలాంటి పరిణామాల మధ్య దేశం విడిచి వెళ్లడమే బెటర్ అనుకొని బిలియ‌నీర్లు బ్యాగులు స‌ర్దేసుకుంటున్నార‌ని చెబుతున్నారు.

దాదాపు 10వేల మంది బిలియ‌నీర్లు చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోవాలన్న ఆలోచనలో ఉన్నార‌ని స‌మాచారం. ఇలా వెళ్లేవారికి సింగపూర్ మొద‌టి గ‌మ్య‌స్థానంగా ఉండ‌గా త‌ర్వాత స్థానాల్లో స్విట్జర్లాండ్‌, ఇజ్రాయిల్‌, ఆస్ట్రేలియా, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాలు ఉన్నాయి.

ర‌ష్యా ప‌రిణామాలు కూడా చైనా బిలియ‌నీర్ల ఆందోళ‌న‌కు ఒక కార‌ణ‌మంటున్నారు. ప్ర‌స్తుతం ర‌ష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో అమెరికా, కెన‌డా, ఆస్ట్రేలియా, జ‌పాన్, యూరోపియ‌న్ దేశాలు.. ర‌ష్యా పైన ఆర్థిక ఆంక్ష‌ల‌తో స‌హా అనేక ఆంక్ష‌లు విధించాయి. ఈ నేప‌థ్యంలో చైనా కూడా తైవాన్ మీద ఇలాగే దాడికి దిగితే చైనా మీద కూడా ఆయా దేశాలు ఆర్థిక ఆంక్ష‌లు విధించే ప్ర‌మాదం ఉంది. ఈ నేప‌థ్యంలో స్వ‌దేశంలోనే ఉంటే న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నాలతోనే చైనా బిలియ‌నీర్లు దేశాన్ని వదులుతున్నార‌ని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.