Begin typing your search above and press return to search.

మమత గెలవాలని దేశం మొత్తం అన్ని ప్రతిపక్షాలు మొక్కుతున్నాయా..?

By:  Tupaki Desk   |   20 March 2021 8:30 AM GMT
మమత గెలవాలని దేశం మొత్తం అన్ని ప్రతిపక్షాలు మొక్కుతున్నాయా..?
X
దేశంలో త్వరలో మినీ సంగ్రామం జరుగబోతుంది. ఈ ఎన్నికల వైపు దేశం మొత్తం చూస్తోంది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లోనే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు సైతం ఇందులో గెలుపు ఎవరిది అని ఎదురుచూస్తున్నాయి. దాదాపు ఏడేళ్లుగా దేశంలో మోడీ ప్రభంజనం కొనసాగుతోంది.. అయితే రైతు చట్టాలు చేయడం నుంచి ఆయన స్ట్రాటజీ తగ్గిందని, అది ఈ ఎన్నికల్లో తెలుస్తుందని ఉత్కంఠతో అందరూ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా త్వరలో పశ్చిమ బెంగాల్ లో జరిగే ఎన్నికల వైపు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమత వ్యతిరేకంగానే ఉంటూ వస్తున్నారు. ఏ విషయంలోనూ తగ్గకుండా మమత గట్టి పోటీనిస్తున్నారు. ఇప్పటికీ రెండు టర్మ్ లు గెలిచిన మమత హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని బీజేపీ అగ్ర నాయకులు శపథం చేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వారి చర్యల్లో భాగంగా టీఎంసీ నుంచి దిగ్గజ నాయకులను కమలంలోకి లాగేసుకుంటున్నారు. అటు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే అమిత్ షా లాంటి నాయకులు పర్యటించి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల వైపు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను తొక్కేస్తున్నారని సంబంధిత నాయకులు అంటున్నారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ పార్టీలను లొంగదీసుకొని మద్దతు కూడగట్టుకోవడమో లేక ఇతర పనుల వల్ల బీజేపీ కిందకి వచ్చేట్లు చేస్తున్నారు. దీంతో మోడీ బాధ పడలేని కొన్ని ప్రాంతీయ పార్టీలు మమత గనుక ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆమె వెంట నడిచేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలోని టీఆర్ఎస్, ఏపీలోని వైసీపీ, టీడీపీ, జనసేనలకు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణలో ఇప్పుడిప్పుడే బీజేపీ బలపడుతోంది. అయితే కేసీఆర్ బీజేపీ అధిష్టానానికి ఎదురుతిరగలేక కొన్ని విషయాల్లో కమలంకు మద్దతునిస్తున్నారు. ఒకవేళ మమత గెలిస్తే ఆయన మమత వెంట వెళ్లుతానడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే గతంలో థర్డ్ ఫ్రంట్ అని కేసీఆర్ దేశమంతా తిరుగుతూ మమత, స్టాలిన్ ను కలిశారు.

ఇక ఏపీలోని వైసీపీ కేంద్రంలోని బీజేపీకి సపోర్టుగా రాజకీయం చేస్తోంది. రాష్ట్రంలో ఆ పార్టీతో మాత్రం వ్యతిరేకంగానే ఉంటున్నారు. అటు టీడీపీ ఇప్పటికే కేంద్రంతో తెగదెంపులు చేసుకున్నారు. జనసేన సైతం ఇటీవల బీజేపీకి దూరంగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో మోడీకి ప్రత్యామ్నాయంగా మమత గెలిస్తే మాత్రం ఆమె వెంట వెళ్లడానికి ఈ ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.

ఇదే బాటలో తమిళనాడులోని డీఎంకే, మహారాష్ట్రంలోని శివసేన, ఢిల్లీలోని ఆప్, ఒడిశాలోని బీజే జనతాదల్, కర్ణాటకలోని జేడీఎస్, యూపీలోని సమాజ్ వాదీ పార్టీలు మోడీకి వ్యతిరేకంగానే ఉంటున్నాయి. దీంతో వెస్ట్ బెంగాల్ ఎన్నికలు దేశ తలరాత మార్చనున్నాయా..? అన్న చర్చ సాగుతోంది. ఏమో చూద్దాం.. ఏం జరుగుతుందో..?