Begin typing your search above and press return to search.

అందరి కళ్ళూ కేసీయార్ మీదేనా ?

By:  Tupaki Desk   |   9 Sept 2022 12:13 PM IST
అందరి కళ్ళూ కేసీయార్ మీదేనా ?
X
ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం ఒక్కసారిగా రోడ్డున పడిపోయింది. గవర్నర్ తమిళిసై-కేసీయార్ మద్య చాలాకాలంగా వివాదాలున్న విషయం తెలిసిందే. ఇంతకాలం కేసీయార్ పైన గవర్నర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాగే గవర్నర్ వైఖరిపైన కేసీయార్ కూడా ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. అలాంటిది తాజాగా రాజ్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కేసీయార్ పరిపాలన ఏమీ బాగాలేదని గవర్నర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

కేసీయార్ పరిపాలన బాగోలేదు కాబట్టి జనాలంతా రాజ్ భవన్లో తన దగ్గరకు వస్తున్నట్లు చెప్పారు. తనకు ప్రభుత్వం కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ఎన్ని లేఖలు రాసినా ప్రభుత్వం నుండి సమాధానం రాలేదన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్ధ చాలా అధ్వాన్నంగా తయారైందని చెప్పారు. ధర్మాసుపత్రుల పరిస్ధితి మరింత దయనీయంగా తయారైందని ఆరోపించారు. మౌలిక వసతులు లేకే కేంద్రం తెలంగాణాకు వైద్య కళాశాలలను మంజూరు చేయడం లేదని చెప్పారు.

రాజ్ భవన్ కు వస్తానంటే కేసీయార్ ఫొటో పెట్టిస్తానని గవర్నర్ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. మీడియా సమావేశంలో చాలా అంశాలను మాట్లాడిన గవర్నర్ కేసీయార్ అధికారాలనే ప్రశ్నించారు. రాజ్ భవన్లో నిర్వహించిన ఎట్ హోంకు ఎందుకు రాలేదు ? దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ మీటింగ్ కు కేసీయార్ ఎందుకు హాజరుకాలేదని నిలదీశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ ను ప్రశ్నించే అధికారం గవర్నర్ కు లేదు. కౌన్సిల్ సమావేశానికైనా, ఎట్ హోం కు అయినా హాజరవ్వాలా వద్దా అన్నది కేసీయార్ ఇష్టం.

ఇక తనకు ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పిన గవర్నర్ ప్రోటోకాల్ ను ఉల్లంఘించిన అధికారులపై ఏమిచర్యలు తీసుకున్నారు ? తన పర్యటనల్లో పాల్గొనాల్సిన కలెక్టర్, ఎస్పీలు కనబడకపోతే వెంటనే వాళ్ళపై యాక్షన్ తీసుకోమని చీఫ్ సెక్రటరీని ఆదేశించాలి. గవర్నర్ అలా చేసినట్లు లేదు.

చీఫ్ సెక్రటరీ యాక్షన్ తీసుకోకపోతే అదే విషయాన్ని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదుచేయాలి. కానీ ఈపని కూడా గవర్నర్ చేసినట్లు లేదు. సరే కేసీయార్ పాలనపై గవర్నర్ ఓపెన్ అయిపోయారు కాబట్టి ఇపుడు కేసీయార్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.