Begin typing your search above and press return to search.

జల్లికట్టుపై మరో నిజాన్ని చెప్పిన నాణెం

By:  Tupaki Desk   |   23 Jan 2017 1:18 PM IST
జల్లికట్టుపై మరో నిజాన్ని చెప్పిన నాణెం
X
తమిళులకు.. జల్లికట్టు క్రీడకు అవినాభావ సంబంధం ఉందన్న వాదన ఎంతో నిజమన్న విషయాన్ని వివరించే కీలక చారిత్రక ఆధారం ఒకటి బయటకు వచ్చింది. జల్లికట్టు ఈ మధ్యన మొదలైంది కాదని.. దాని మూలాలు చాలా బలమైనవన్న తమిళుల వాదనకు తగ్గట్లే తాజాగా జరిపిన ఒక పరిశోధన కొత్త విషయాల్ని చెబుతోంది. క్రీ.శ. 3 శతాబ్దంలోనే జల్లికట్టు ఉందని.. తాజాగా లభ్యమైన శిలాఫలకాలు.. నాణేలు దొరికిన విషయాన్ని దక్షిణ భారత నాణేల పరిశీలన సంస్థ చెబుతోంది.

తమిళనాడును మూడో శతాబ్దంలో పాలించిన పాండ్య రాజులు సంప్రదాయ క్రీడను ప్రోత్సహించారని..అప్పటి యువతకు ఈ ఆటపై అవగాహన పెరిగేలా ప్రచారం కూడా చేసిన విషయం తెలిసిందని చెబుతున్నారు. పొగరుబోతు కోడెలను పెంచుకునేందుకు రాయితీలు కల్పించటంతో పాటు.. వాటితో పోటీ పడే వీరులకు బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చిన విషయం కూడా తాజాగా బయటకు వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఇందుకు సంబంధించిన పురాతన నాణెలు కొన్ని లభించినట్లుగా చెబుతున్నారు. ఈ నాణెల మీద ఎద్దుల్ని లొంగదీసుకునే చిత్రాలు ఉన్నాయని..దీంతో అప్పటి నుంచే జల్లికట్టు ఉందన్న విషయం అర్థమవుతుందని చెప్పారు. శతాబ్దాల తరబడి జల్లికట్టుతో తమిళులకు అనుబంధం ఉందనటానికి ఈ నాణెలు ఒక ఉదాహరణగా చెబుతున్నారు. ఈ వాదన తమిళులకు అమితమైన ఆనందాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/