Begin typing your search above and press return to search.

బాబు సొంత జిల్లాలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రిపదవి?

By:  Tupaki Desk   |   29 Oct 2021 7:00 AM IST
బాబు సొంత జిల్లాలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రిపదవి?
X
ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ప్రాంతాల గురించి మాట్లాడుకోవటం ఎక్కువైందన్న మాట తరచూ వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ తెలంగాణ అన్న మాటలే వినిపించేవి. అప్పుడప్పుడు 'సీమ' ప్రస్తావన వచ్చేది. విభజన తర్వాత ఏపీ రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే.. 'సీమ'.. 'కోస్తా'.. 'గోదావరి'.. 'ఉత్తరాంధ్ర' అన్న మాటలు తరచూ వినిస్తున్నాయి. కోస్తా కింద గోదావరి జిల్లాల్ని వేసినా.. కొంతమంది మాత్రం కోస్తాకు భిన్నమైన కల్చర్ గోదావరి జిల్లాల్లో ఉందన్న మాట వినిపిస్తోంది.

ఇలా.. ఎవరికి వారుగా.. ఏ ప్రాంతానికి చెందిన వారు తమ ప్రాంతాన్ని మిగిలిన ప్రాంతాలతో వేరు చూసే ధోరణి ఎక్కువైందన్న మాట రాజకీయ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇక.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త కేబినెట్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ప్రాంతాల వారీగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ ఈ మధ్యన జోరుగా సాగుతోంది. విపక్ష నేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు విషయానికి వస్తే.. రెడ్లకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్న మాట పలువురు నోట రావటం తెలిసిందే. అయితే.. ఈసారి రోటీన్ కు భిన్నంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు.. ఇతర సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి దక్కే వీలుందని చెబుతున్నారు. ఇలా చేస్తే.. సామాజిక న్యాయం జరుగుతుందన్న ఆలోచనతో జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకునే వీలుందంటున్నారు.

జిల్లాకు చెందిన నేతల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడి.. 2019లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన కాపు సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులు మంత్రి అయ్యే ఛాన్సు ఎక్కువగా ఉందంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే.. మంత్రి పదవిని కట్టబెడతారా? అంటే.. అవునని చెప్పటమే కాదు.. దాని వెనకున్నకారణాల్ని చెప్పుకొస్తున్నారు. దీనికి తోడు ఆరణి శ్రీనివాసులు సైతం ఏ మాత్రం తగ్గకుండా చేస్తున్న ప్రయత్నాలు కూడా ముఖ్యమంత్రి విష్ లిస్టులో చేరినట్లుగా తెలుస్తోంది.

సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి ఎమ్మెల్యేగా ఎదిగే క్రమంలో కాంగ్రెస్.. ప్రజారాజ్యం.. తెలుగుదేశం పార్టీల్లో చేరి.. చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి.. ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు విఫలయత్నం తర్వాత ఎమ్మెల్యే అయిన మొదట్లో ఆరణి కాస్త ఓవరాక్షన్ చేశారని.. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుఅయినా పెద్దిరెడ్డితో పేచీ కొట్టుకునేందుకు సైతం వెనుకాడలేదని చెబుతారు. తత్త్వం త్వరగానే బోధ పడి.. ఆయనతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గ్రహించి వెనక్కి తగ్గారని.. అప్పటి నుంచి ఆయనతో సత్ సంబంధాలు నెరపటమేకాదు.. తాజాగా ఆయన చేతనే మంత్రిగా అవకాశం ఇప్పించాలన్న వినతిని జగన్ వరకు తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యారంటున్నారు.

జిల్లాకు చెందిన వైసీపీ నేతల్లో మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నా.. శ్రీనివాస్ కు ఆమాత్య యోగం కలగటానికి కారణం.. ఆయన సామాజిక వర్గమేనని చెబుతున్నారు. అంతేకాదు.. తనకు అవకాశం ఉందన్న విషయాన్ని గ్రహించిన ఆయన తన సొంత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కమ్ బంధువు అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు.. మంత్రి బొత్స సత్యనారాయణతో కూడా రాయబారాన్ని నడుపుతున్నట్లుగాచెబుతున్నారు. ఇలా సామాజిక అంశాల్ని బలంగా ముందుకు తీసుకురావటం ద్వారా జగన్ లెక్కల్లో తాను భాగస్వామ్యం కావాలని భావిస్తున్నారట. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. జగన్ సిద్ధం చేసిన షార్ట్ లిస్టులో ఆయన పేరు ఉందని.. మరో వడబోతకు తట్టుకొని నిలబడితే అమాత్యయోగం దక్కినట్లేనన్న మాట వినిపిస్తోంది. మరీ.. వాదనలో నిజం ఎంతో కాలమే బదులివ్వాలి.