Begin typing your search above and press return to search.

రెహామన్ పై ఇలాంటి వ్యాఖ్యలు భావ్యమా?

By:  Tupaki Desk   |   19 Sep 2015 10:27 AM GMT
రెహామన్ పై ఇలాంటి వ్యాఖ్యలు భావ్యమా?
X
ఎ.ఆర్.రెహమాన్.. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు. రెండు ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టినా ఆ గర్వం కించిత్ అయినా లేకుండా ఒకప్పట్లాగే అందరికీ అందుబాటులో ఉంటూ సినిమాలు చేస్తున్నాడు. అలాంటి వాడిని కొన్ని రోజులుగా అనవసర వివాదాల్లోకి లాగుతున్నారు జనాలు. ఇరాన్ సినిమా మహమ్మద్ కు సంగీతం అందించడంపై మండిపడుతూ ముస్లిం పెద్దలు రెహమాన్ పై ఫత్వా విడుదల చేయడం మొదలు రెహమాన్ పేరు వివాదాల్లో నలుగుతోంది.

ముస్లిం పెద్దలు చేసిందే తప్పంటే.. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవడానికి హిందూ సంస్థలు ప్రయత్నించడం విచారకరం. రెహమాన్ పై ఫత్వా విధించిన నేపథ్యంలో అతను తిరిగి హిందూయిజంలోకి వచ్చేయాలంటూ పిలుపునిచ్చింది విశ్వ హిందూ పరిషత్. రెహమాన్ ఒకప్పడు హిందువు, అతడి పేరు దిలీప్ అన్న సంగతి తెలిసిందే. ఆర్థిక కారణాలతోనే రెహమాన్ ఇస్లాం మతం స్వీకరించాడన్న వీహెచ్పీ నాయకులు.. అతను వెంటనే హిందూ మతంలోకి వచ్చేయాలన్నారు.

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (భాజపా) అయితే ఓ అడుగు ముందుకేసి వీహెచ్పీ వాళ్లు రెహమాన్ ను హిందూ మతంలోకి తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలని.. రెహమాన్ పై ఒత్తిడి తేవాలని పట్టుబడుతున్నాడు. రెహమాన్ వ్యక్తిగత కారణాలతో ఇస్లాం మతం స్వీకరించాడు. ఆ తర్వాత జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగాడు. మతం మారడంలో అతడి విశ్వాసాలేవో అతడికుంటాయి. అది అతడి వ్యక్తిగత విషయం. వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ దేశ కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిన రెహమాన్ విషయంలో ఇంత వివాదం రాజేయడం భావ్యమా?