Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ బై

By:  Tupaki Desk   |   12 July 2015 11:52 PM IST
హైదరాబాద్ కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ బై
X
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) అతి త్వరలోనే గుడ్ బై చెప్పనుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి పూర్తి స్వేచ్ఛతో నవ్యాంధ్ర ప్రాంతంలోనే తమ కార్యకలాపాలను నిర్వహించాలని సంకల్పం చెప్పుకొంది. ఆ దిశగా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది.

ఆగస్టు 15వ తేదీ నుంచి ఆర్టీసీ పరిపాలనను విజయవాడ నుంచే సాగించాలని దాని ఎండీ నండూరి సాంబశివరావు కంకణం కట్టుకున్నారు. అందుకు ఆయన విజయవాడలోనే ఉండి శరవేగంగా పనులు చేయిస్తున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లోనే ఆయన క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. ఇప్పటికే పూర్తయిన ఈ కార్యాలయానికి తుది మెరుగులు దిద్దాల్సి ఉంది. హైదరాబాద్ లోని బస్ భవన్ చాంబర్లను తలదన్నేలా ఇక్కడ అధికారుల చాంబర్లు సిద్ధమవుతున్నాయి. ఇంటీరియర్ అదిరిపోయేలా ఉండడానికి లేపాక్షి సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఆర్టీసీ ఎండీ తన కార్యాలయంలో కూర్చుంటే ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మ ఆలయం కనిపించేలా దీనిని రూపుదిద్దుతున్నారు. గోడల స్థానంలో అద్దాలను ఏర్పాటు చేస్తుండడంతో పారదర్శకంగా ఉండడమే కాకుండా బయటి అందమైన దృశ్యాలు కూడా కనిపిస్తాయి. ఇక పీఎన్బీఎస్లో ఆర్టీసీ డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడానికి స్టార్ హోటల్ మాదిరిగా విశ్రాంతి గదులను ఏర్పాటు చేస్తున్నారు. విశ్రాంతి మందిరాన్ని ఆధునికీకరించడంతోపాటు మరొక దానిని కూడా నిర్మిస్తున్నారు. డ్రైవర్లకు రీడింగ్ రూమ్.. ఫ్రెష్ కావడానికి ఆధునిక మరుగు దొడ్లు నిర్మిస్తున్నారు.

మొత్తంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నే రూపు మార్చేస్తున్నారు. దీనిని విమానాశ్రయం మాదిరిగా మారుస్తున్నారు. బస్ స్టేషన్ లోని ప్లాట్ పారాలను కూడా మోడల్ ఫ్లాట్ ఫారాలుగా తీర్చి దిద్దుతున్నారు. ప్రయాణికులను సమాచారం తెలిసేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ను ఆధునికంగా తీర్చిదిద్దడమే కాదు.. ఇక్కడి నుంచే ఆర్టీసీ పరిపాలనను కూడా సాగించాలని ఎండీ సాంబశివరావు భావిస్తున్నారు. ఆర్టీసీకి చెందిన మిగిలిన కార్యకలాపాలనూ ఆయన శరవేగంగా పూర్తి చేయిస్తున్నారు.