Begin typing your search above and press return to search.

తెలంగాణ ఆర్టీసీకి ఏపీఎస్ ఆర్టీసీ దెబ్బ!

By:  Tupaki Desk   |   14 Jun 2022 6:30 AM GMT
తెలంగాణ ఆర్టీసీకి ఏపీఎస్ ఆర్టీసీ దెబ్బ!
X
తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు రెండోసారి పెంచడం ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీకి అనుకూలంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణలోనే ఆర్టీసీ చార్జీలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. దాంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులకే ప్రయాణికులు ప్రాధాన్యమిస్తున్నారు.

దీంతో ఏపీఎస్‌ ఆర్టీసీ రాబడి గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణ ఆర్టీసీ.. డీజీల్‌ సెస్‌ పేరుతో జూన్‌ 9న రెండోసారి చార్జీలు పెంచింది. దీంతో కనీసం రూ.5 నుంచి గరిష్టంగా రూ.170 వరకు తెలంగాణలో బస్సు చార్జీలు పెరిగాయి. ప్రధానంగా 100 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణంపై చార్జీల పెంపు భారం అధికంగా ఉంది. ఈ పరిణామం ఏపీఎస్‌ ఆర్టీసీకి వరంగా మారింది.

జూన్‌ 9 కంటే ముందు విజయవాడ -హైదరాబాద్‌ రూట్లో ఏపీఎస్ ఆర్టీసీకి రోజుకు గరిష్టంగా రూ.కోటి రాబడి వచ్చేది. కానీ తెలంగాణ ఆర్టీసీ చార్జీలు రెండోసారి పెంచాక ఏపీఎస్‌ ఆర్టీసీ రాబడి పెరుగుతోంది. జూన్‌ 9న రూ.1.19 కోట్ల రాబడి రాగా.. జూన్‌ 10న రూ.1.21 కోట్లు వచ్చింది. జూన్‌ 11న రూ.1.26 కోట్లు, జూన్‌ 12న రూ.1.24 కోట్లు ఆదాయం వచ్చింది.

ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉండే హైదరాబాద్‌ రూట్లో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు పెరుగుతోంది. విజయవాడ-హైదరాబాద్‌ రూట్లో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్‌ సర్వీసులకు ప్రయాణికుల నుంచి ఆదరణ మరింతగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ముందస్తు రిజర్వేషన్లకు డిమాండ్‌ కూడా పెరుగుతోంది. దీంతో ఏపీఎస్‌ ఆర్టీసీ రాబడి కూడా గణనీయంగా వృద్ధి చెందుతోంది.

ఉదాహరణకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సూపర్‌ లగ్జరీ చార్జీ తెలంగాణ ఆర్టీసీలో రూ.505. కానీ ఏపీఎస్‌ఆర్టీసీలో రూ.470 మాత్రమే. అలాగే ఏపీఎస్‌ఆర్టీసీ ఇంద్ర బస్‌లో హైదరాబాద్‌ (కేపీహెచ్‌బీ)కి చార్జీ రూ.610 ఉండగా.. తెలంగాణ ఆర్టీసీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చార్జీ రూ.642. అదేవిధంగా ఏపీఎస్‌ఆర్టీసీ గరుడ సర్వీసులో హైదరాబాద్‌ (కేపీహెచ్‌బీ)కి చార్జీ రూ.690 ఉండగా.. తెలంగాణ ఆర్టీసీలో చార్జీ రూ.783గా ఉంది.

రానున్న రోజుల్లో విజయవాడ -హైదరాబాద్‌ రూట్‌తోపాటు తిరుపతి- హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కూడా ఏపీఎస్‌ ఆర్టీసీ రాబడి మరింతగా పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా బస్‌ సర్వీసులు పెంచడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాల కల్పనపై దృష్టిసారించారు.