Begin typing your search above and press return to search.

మ‌హిళా విభాగం స‌రే.. మ‌రి పీసీసీ చీఫ్..?

By:  Tupaki Desk   |   26 Jun 2021 9:30 AM GMT
మ‌హిళా విభాగం స‌రే.. మ‌రి పీసీసీ చీఫ్..?
X
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్య‌క్షురాలి నియామ‌కం పూర్త‌యింది. నూత‌న అధ్య‌క్షురాలిగా సునీత ముదిరాజ్ నియ‌మితుల‌య్యారు. ఈ నియామ‌కంతో మ‌రి, పీసీసీ అధ్య‌క్షుడి నియామ‌కం ఎప్పుడు అని ప్ర‌శ్నిస్తున్నారు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు. వాస్త‌వానికి పీసీసీనే త్వ‌ర‌గా కావాల‌న్న‌ది వారి కోరిక‌.

అప్పుడెప్పుడో గ‌త ఏడాది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఈ పీసీసీ కిరీటాన్ని తాను మోయలేనంటూ కాడి ఎత్తేశారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అధ్య‌క్ష నియామ‌కం పూర్తి కాలేదు. కొంద‌రు త‌మ‌కే ప‌ద‌వి కావాలని కొట్లాడుతుండ‌గా.. మ‌రికొంద‌రు ప‌లానా వాళ్ల‌కు ద‌క్క‌కుండా పోరాటం చేస్తున్నారు. అయితే.. రాష్ట్రంలో పార్టీ బాగు కోరుకునేవారితోపాటు ప‌లువురు నేత‌లు మాత్రం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికే అప్ప‌గించాల‌ని కోరుతున్నారు.

దీనికి సీనియ‌ర్లు స‌సేమిరా అంటున్నారు. ఇన్నాళ్లూ పార్టీలో ఉన్న తమను కాదని, కొత్తగా వచ్చిన రేవంత్ కు పగ్గాలు ఎలా ఇస్తారన్నది వాళ్ల కడుపు మంటగా చెబుతున్నారు. రేవంత్ కు పీసీసీ ఇవ్వకుండా అధిష్టానం వద్ద తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారట కొందరు నేతలు. ఈ తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ఏర్పడిన దగ్గర్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ ను నేరుగా ఎదుర్కొన్న నేత కాంగ్రెస్ లో లేడ‌ని అంటున్నారు. అందువల్లే.. దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వాల‌నే డిమాండ్ మొద‌లైంది. రోజురోజుకూ ఈ డిమాండ్ బ‌లపడుతోంది కూడా. కేసీఆర్ ను ఎదుర్కోవ‌డం రేవంత్ వ‌ల్ల‌నే అవుతుంద‌న్నది కాంగ్రెస్ శ్రేణుల‌ న‌మ్మ‌కం. కానీ.. దీనికి అడ్డం పడుతున్నారట సీనియ‌ర్లు.

అంతేకాదు.. రేవంత్ కు ఇస్తే మాత్రం.. తాము పార్టీ నుంచి కూడా వెళ్లిపోతామ‌ని కొంద‌రు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు జ‌గ్గారెడ్డి వంటివారు ఫీల‌ర్లు కూడా వ‌దులుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత జ‌రుగుతున్నా.. అధిష్టానం మాత్రం ఇంకా తాత్సారం చేయ‌డం ఏంట‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. అంటే.. తెలంగాణ సీనియ‌ర్ల‌కు కాంగ్రెస్ అధిష్టానం భ‌య‌ప‌డుతోందా? అనే అనుమానం కూడా వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు ద‌ఫాలుగా అధికారం కోల్పోయిన నేప‌థ్యంలో.. పార్టీకి జ‌రిగే మంచి గురించి మాత్ర‌మే అధిష్టానం ఆలోచించాల‌ని కోరుతున్నారు. మ‌రి, కాంగ్రెస్ పెద్ద‌లు ఏం చేస్తారో చూడాలి. మ‌హిళా అధ్య‌క్షురాలి నియామ‌కంతో.. త్వ‌ర‌లోనే పీసీసీ చీఫ్ ఎంపిక కూడా పూర్త‌వుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.