Begin typing your search above and press return to search.

బీసీ కార్పొరేషన్లకి 18న చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం ..మహిళలకే ప్రాధాన్యం !

By:  Tupaki Desk   |   16 Oct 2020 3:30 PM IST
బీసీ కార్పొరేషన్లకి 18న చైర్మన్లు, డైరెక్టర్ల  నియామకం ..మహిళలకే ప్రాధాన్యం !
X
ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ ను పెద్దఎత్తున విభజించి భారీగా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. బీసీల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం , 139 కులాల సంక్షేమం కోసం మొత్తం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ విధంగా వెనుకబడిన తరగతుల కోసం ఇన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వ జగన్ ప్రభుత్వం మాత్రమే. దేశ చరిత్రలోనే తొలిసారిగా వెనుకబడిన తరగతులకు చెందిన 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీటికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి చిత్తశుద్ధి చాటుకునేందుకు పక్కా ప్రణాళికలతో సిద్ధమైంది.

ప్రతి సంక్షేమ పథకంలోనూ సీఎం జగన్ బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పొరేషన్‌ లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్ ‌లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్ల ను ‘సి’ కేటగిరీ కింద విభజించారు. మొత్తం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఇందులో 29 మహిళలకు, 27 పురుషులకు దక్కే అవకాశం ఉంది. డైరెక్టర్‌ పదవుల్లో 50 శాతం మహిళలను నామినేట్‌ చేయనున్నారు. సాధ్యమైనన్ని బీసీ కులాలకు పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించినట్లు సమాచారం. అంతేకాదు అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కనుంది. ప్రతి జిల్లాకు కనీసం 4 కార్పొరేషన్లకు తగ్గకుండా పదవులు రానున్నాయి. అలాగే కొన్ని జిల్లాలకు జనాభా ప్రాతిపదికన 5, 6 పదవులు దక్కే అవకాశం ఉంది.

బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలకు అక్టోబరు 18వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ఒక్కో కార్పొరేషన్‌కు 13 మంది డైరెక్టర్లను నియమించి అన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించనున్నారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా 728 మంది డైరెక్టర్లుగా పదవులు పొందనున్నారు. జగన్ ఎన్నికల హామీ మేరకు బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తూ కార్పొరేషన్ పదవులను ఖరారు చేసే బాధ్యతను పార్టీ సీనియర్‌ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలకు అప్పగించారు. వీరంతా ఆయా జిల్లాలకు పరిశీలకులుగా ఉన్నారు. వారు పలు దఫాలుగా వినతులను పరిశీలించి ఇప్పటికే తుది నివేదిక సిద్ధం చేసారు. వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 నెలల వ్యవధిలోనే 2,71,37,253 మంది బీసీలకు రూ. 33,500 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. ఇంత భారీగా బీసీల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు లేదు. బీసీలకు నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పోస్టుల్లో సగం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కనుంది.