Begin typing your search above and press return to search.

రాజకీయాలను వేడిక్కించేస్తున్న రాజీనామాల సవాళ్ళు

By:  Tupaki Desk   |   6 Oct 2020 8:30 PM IST
రాజకీయాలను వేడిక్కించేస్తున్న రాజీనామాల సవాళ్ళు
X
ప్రస్తుతం ఏపిలో రాజకీయాలు చాలా హాటు హాటుగా ఉన్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదన కేంద్రంగా రాజీనామాలపై సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. తాజాగా మరో మంత్రి సీదిరి అప్పలరాజు రాజీనామాకు రెడీ అంటూ చేసిన సవాలుతో ఉత్తరాంధ్ర ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు జోరందుకున్నాయి. నాలుగు రోజుల క్రితం ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా రాజీనామాకు రెడీ అంటు చేసిన సవాలుతో ఎంత గోల జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ గోల సద్దుమణగముందే అప్పలరాజు రాజీనామా ప్రకటన చేయటంతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది.

జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతుగా సిక్కోలు జిల్లాకే చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామాలకు రెడీ అంటూ సవాలు విసిరారు. మొదటగా కృష్ణదాస్ మాట్లాడుతు మొత్తం ఉత్తరాంధ్రలో ఎక్కడి నుండైనా పోటీకి తాను రెడీ అంటూ ప్రకటించారు. టీడీపీ తరపున పోటీ చేయబోయేది ఎవరో ప్రకటిస్తే తాను వెంటనే మంత్రి, ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేస్తానంటూ సవాలు విసిరారు. ధైర్యముంటే తనపై చంద్రబాబునాయుడు పోటి చేసి గెలవాలంటూ చేసిన సవాలుతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు.

ధర్మాన ఎంఎల్ఏ పదవికి రాజీనామా రెడీ అంటే టీడీపీ నేతలు స్పందన ఇంకోలా ఉంది. విశాఖపట్నం ఎంపితో రాజీనామా చేయిస్తే తాము పోటీకి సిద్ధమంటూ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యూహాత్మక రిప్లై ఇచ్చారు. రాజధాని విశాఖ కాబట్టి విశాఖ ఎంపీ చేయాలి అన్నది అయ్యన్న లాజిక్ కావచ్చు. పైగా అక్కడైతే టీడీపీ బలంగా ఉందన్న భావనతో కూడా అయ్యన్న ఈ డిమాండ్ చేసుంటారు. ఇక మంత్రి చేసిన రాజీనామా సవాలు విషయంలో మాత్రం టీడీపీ నేతలెవరు సూటిగా ఇప్పటి వరకు స్పందించలేదు.

సరే ఈ విషయం ఇలాగుండగానే మరో మంత్రి సీదిరి అప్పలరాజు కూడా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. మంత్రి, ఎంఎల్ఏ పదవులకు రాజీనామా చేయటానికి తాను కూడా రెడీగా ఉన్నట్లు చెప్పారు. విశాఖపట్నం నగరంలో గెలిచిన టీడీపీ ఎంఎల్ఏలు కూడా రాజీనామాలు చేస్తే అందరం కలిసి ఉపఎన్నికల్లో పోటీ చేద్దామంటూ సవాలు విసిరారు. అయితే తెలుగుదేశంపార్టీ ఎంఎల్సీ దీపక్ రెడ్డి స్పందిస్తు రాజధాని అనేది ఏపీ మొత్తానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి వైసిపి తరపున గెలిచిన మొత్తం 151 మంది ఎంఎల్ఏలూ రాజీనామాలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అప్పలరాజుతో జరిగిన ముఖముఖి కార్యక్రమంలో పాల్గొన్న దీపక్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని అన్నారే కానీ వైజాగ్ సిటీ టీడీపీ ఎంఎల్ఏల రాజీనామాల విషయంపై మాత్రం మాట్లాడలేదు.