Begin typing your search above and press return to search.

సూపర్ ఫాస్ట్?; విడాకులు తీసుకోవటానికీ యాప్

By:  Tupaki Desk   |   3 Jun 2016 8:01 AM GMT
సూపర్ ఫాస్ట్?; విడాకులు తీసుకోవటానికీ యాప్
X
జీవితం చాలా వేగవంతమైంది. బంధం కలుపుకోవాలన్నా.. తుంచుకోవాలన్నా.. విషయం ఏదైనా ఇన్ స్టెంట్ గా జరిగిపోవాలంతే. ఎక్కువ ఆలస్యానికి భరించలేరు. విలువైన కాలాన్ని వృధా చేయటానికి ఎవరూ ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. అందుకేనేమో.. మారుతున్న కాలానికి తగ్గట్లుగా చాలానే మార్పులు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న యాప్ ప్రపంచంలోకి కొత్త యాప్ ఒకటి రానుంది. ఈ యాప్ జంటలకు విడాకుల్ని వీలైనంత త్వరగా ఇప్పించేలా సాయం చేస్తుందని చెబుతున్నారు.

కాకుంటే ఈ యాప్ మన దగ్గర కాదు యూకేకు మాత్రమే పని చేస్తుంది. ఇంతకీ ఈ యాప్ తయారు చేయాల్సిన అవసరం ఏముచ్చిందన్న సందేహం అక్కర్లేదు. దానికి కారణం బలంగానే ఉంది. ఎందుకంటే.. భార్యభర్తలు తమ మధ్య అనుబంధానికి తెర వేయాలనుకుంటే అక్కడ ప్రాసెస్ పెద్దదిగా ఉండటం.. ఖరీదైన వ్యవహారంగా ఉండటంతో పాటు టైం ఎక్కువ తీసుకోవటంతో విడాకుల కోసం బాగా తిరగాల్సి వస్తోందట. ఇంగ్లండ్.. వేల్స్ లలో విడాకులు తీసుకునే దంపతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందట. దీనికి తోడు విడాకులు తీసుకునేందుకు అక్కడి చట్టాల ప్రకారం తక్కువలో తక్కువ ఏడాది సమయం కూడా పడుతుందట. దీంతో.. వీలైనంత త్వరగా బ్రేకప్ కు వీలైన మార్గాలు వెతుకుతున్న నేపథ్యంలో ఈ యాప్ కాన్సెప్ట్ తెర మీదకు వచ్చిందట.

అందుకే.. అలాంటి ఇబ్బందులు లేకుండా చేతిలో ఉన్న మొబైల్ తోనే పెళ్లిని పెటాకులు చేసుకోవటానికి ఎంతో సౌకర్యవంతంగా ఈ యాప్ ఉండనుందని చెబుతున్నారు. ఈ యాప్ కానీ అందుబాటులోకి వస్తే దంపతులు ఇద్దరు సామరస్యపూర్వకంగా గుడ్ బై చెప్పుకునేందుకు వీలవుతుందట. మామూలుగా అయితే.. యూకేలో విడాకులంటే కోర్టు.. లాయర్ల ఫీజులకే లక్షల రూపాయిలు ఖర్చు చేయాల్సి ఉంటుందట. కానీ.. ఈ యాప్ కానీ అందుబాటులోకి వస్తే.. పదుల పౌండ్స్ తో (వందల్లో) పని పూర్తి అవుతుందని చెబుతున్నారు. ఈ యాప్ గురించి విన్న పలువురు ఇదెప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారట. ఎందుకంటే.. విడాకులు అనగానే.. ఎందుకు? ఏమిటి? లాంటి సవాలచ్చ ప్రశ్నలు అడగటం.. వాటికి సమాధానం చెప్పటం లాంటి తలనొప్పులు మొత్తం తీరిపోతాయని ఆశిస్తున్నారట. ఈ లెక్కన రానున్నరోజుల్లో ఇంకెలాంటి యాప్ లు అందుబాటులోకి వస్తాయో..?