Begin typing your search above and press return to search.

అమ్మా.. వేలు వదిలిపెట్టి తాత ఎళ్లిపోయాడే

By:  Tupaki Desk   |   28 July 2015 4:26 AM GMT
అమ్మా.. వేలు వదిలిపెట్టి తాత ఎళ్లిపోయాడే
X
దారుణం జరిగిపోయిందమ్మా. స్వచ్ఛమైన నవ్వుతో.. దేశం గురించి.. దేశ ప్రజల గురించి నిత్యం తపించే కలాం తాతయ్య వెళ్లిపోయారు. తాతయ్యకు మామీద ఎందుకంత కోపం? ఏళ్లకు ఏళ్లుగా.. ఆయన వేలెట్టుకొని తిరిగే మేం.. ఇప్పుడేం చేయాలి?

స్ఫూర్తిప్రదాతగా.. దేశ భక్తికి నిలువెత్తు రూపంగా.. ఈ దేశంలో నీతికి..నిజాయితీలు బతికే ఉన్నాయన్న భరోసా ఇచ్చే తాతయ్య అలా వెళ్లిపోవటం ఏమిటి? ఈ దేశంలో వెళ్లిపోవాల్సిన వారు.. భారంగా ఉన్న వారు ఎంత మంది లేరు? వారందరిని వదిలేసి.. ఈ మాయదారి మృత్యువు కలాం తాతనే కబళించాలా? ఊహకు కూడా అందనివి జరిగితే మేమేం చేయాలమ్మా..?

ఏ తెల్లోడి దయ కోసమో ఎదురు చూస్తూ.. వాడు వేసే బిచ్చం లాంటి ఆయుధాలే మహాఅద్భుతమని ఫీలైపోయే మాకు.. మనలో ఆ సత్తా లేదా? అన్న ప్రశ్న సంధించి.. భారతీయుడి సత్తా ఏమిటో తెలిసేలా చేసిన తాతను అలా తీసుకెళ్లటం ఏమిటి? సవాళ్లతో నిత్యం కుస్తీ పట్టి.. ఒక పట్టాన మింగుడు పడని ఎన్నో శాస్త్ర సాంకేతిక సవాళ్లను పరిష్కరించిన కలాం తాతయ్య మమ్మల్ని అలా వదిలేసి ఎలా వెళతారమ్మ..?

గంజాయి వనంలో తులసి చెట్టు మాదిరి.. దుర్గంధభరితమైన రాజకీయ గంజాయి వనంలోకి ప్రవేశించి.. రాష్ట్రపతి హోదాలో ఐదేళ్లు వ్యవహరించి.. ఆ పదవికే వన్నె తేవటమే కాదు.. తులసి చెట్టు మాదిరి ఉంటూ.. గంజాయి వనంలోనూ తన సువాసనల్ని వెదజల్లగలనని నిరూపించిన తాతయ్య అవసరం ఈ దేశానికి ఇంకెంతో ఉంది కదమ్మా?

భారతరత్నమనే మాటకే నిండుతనాన్ని తీసుకొచ్చి.. స్వార్థరహితంగా వ్యవహరించే తాతయ్య అవసరం దేశానికి ఎంతో. ఇప్పటికే ఏదైనా సమస్య వచ్చి పడితే.. ఏదైనా సందేహం పెరిగి పెద్దది అయితే.. అందరి చూపులు తాతయ్య వైపు వెళ్లే పరిస్థితి. ఆయన కానీ.. స్పందించి ఆయన నోటి నుంచి ఒక్కమాట వస్తే.. అదే కొండంత భరోసా. అలాంటి ధీమాను దూరం చేస్తూ.. మా చిటికెన వేలును వదిలేసి తాతయ్య మమ్మల్ని విడిచి ఎలా వెళ్లిపోతారమ్మ..?