Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ఏబీకి పోస్టింగ్ : లాంగ్ లీవ్ లోకి వెళ్తారా...?

By:  Tupaki Desk   |   15 Jun 2022 4:08 PM GMT
ఎట్టకేలకు ఏబీకి పోస్టింగ్ :  లాంగ్ లీవ్ లోకి వెళ్తారా...?
X
మొత్తానికి అలుపెరగని వీరుడు మాదిరిగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి ఫలితాన్ని సాధించారు. ఆయనకు ఎట్టకేలకు ఒక పోస్టింగ్ అయితే దక్కింది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆయన్ని ప్రింటింగ్ స్టేషనరీ అండ్ స్టోర్స్ కొనుగోలు విభాగం కమిషనర్‌గా నియమిస్తూ జిఓ ఆర్‌టి నెం. 1115 మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో ఏబీకి పోస్టింగ్ దక్కిన ఆనందం ఆవిరి అయిపోయింది. ఈ విభాగానికి సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి అందునా గత ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏఅబీవీని తెచ్చి నియమించడం అంటే స్థాయి హోదా తగ్గించడమే అని అంటున్నారు. ఈ పోస్టుని సాధారణంగా హోం డిపార్ట్మెంట్ లో ఉన్న సీనియర్లు ఎవరైనా ఇంచార్జిగా చూస్తూంటారు.

దాంతో ఈ పోస్టులోకి సీనియర్ అధికారి నియామకం కావడం, పూర్తి స్థాయి బాధ్యతలు అంటే ఏబీకి ఒక విధంగా డీ గ్రేడింగే అని అంటున్నారు. దాంతో ఆయన ఈ పోస్టులో చేరుతారా లేక లాంగ్ లీవ్ పెట్టి అలా తన అసమ్మతిని తెలియచేస్తారా అన్నది చూడాలి.

ఇక ఏబీ తీరు చూస్తే పోరాడే తత్వం ఆయనలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కాదు ఆయన తన సస్పెన్షన్ అన్నది తప్పు అని కూడా హై కోర్టు సుప్రీం కోర్టు దాకా వెళ్ళి పోరాడి సాధించుకున్నారు. తన సస్పెన్షన్ తప్పు అయినందువల్ల తనకు పరిహారంగా పాత జీతం మొత్తం ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఇక సుప్రీం కోర్టు ఆర్డర్లతో పాటు తన వద్ద ఉన్న ఆధారాలతో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వరసబెట్టి అనేక లేఖలు రాయడం జరిగింది. అనేక పర్యాయాలు లేఖలు రాసినా స్పందించడంలేదని, తనకు పోస్టింగ్ ఇవ్వలేదని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. మొత్తానికి ఆయనను గత నెల 18న సర్వీసులోకి తీసుకుంటున్నట్లుగా చెప్పిన ప్రభుత్వం నెల రోజుల పాటు అలా ఖాళీగా ఉంచి ఇపుడు ఒక అప్రధానమైన విభాగానికి కమిషనర్ గా చేసింది.

మరి ఏబీ ఈ విషయంలో నెగ్గినట్లేనా అంటే కాదు అనే అంటున్నారు. దాంతో ఆయన ఏం చేయబోతారు అన్న చర్చ సాగుతోంది. ఆయన లాంగ్ లీవ్ పెట్టి తన అసమ్మతిని తెలియచేయడమే ప్రస్తుతం ఉన్న ఆప్షన్ అని అంటున్నారు. చూడాలి మరి ఏబీ ఎలా రియాక్ట్ అవుతారో.