Begin typing your search above and press return to search.

రిజ‌ర్వేష‌న్లు వ‌ద్దంటున్న సీఎం మ‌ర‌ద‌లు

By:  Tupaki Desk   |   8 Feb 2017 11:20 AM GMT
రిజ‌ర్వేష‌న్లు వ‌ద్దంటున్న సీఎం మ‌ర‌ద‌లు
X
స‌మాజ్ వాదీ పార్టీ ములాయ సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు - సీఎం అఖిలేశ్ యాద‌వ్ మ‌ర‌ద‌లు అపర్ణా యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం ఆధారంగా రిజర్వేషన్లు అవసరం లేదని ఆమె క‌రాఖండిగా చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో అపర్ణా యాదవ్ కుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. ''మేము (యాదవులు) కులం ఆధారంగా ఒబిసి పరిధిలోకి వస్తాం. అయితే మా కుటుంబం ఉన్నతస్థితిలో వుంది. మేం కులం ఆధారంగా రిజర్వేషన్లు ఎలా తీసుకుంటాం' అని ఆమె ప్రశ్నించారు. యులాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ భార్య అపర్ణ. ఆమె తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున ఆమె పోటీ చేస్తున్నారు.

కాగా, రిజర్వేషన్లపై అపర్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆమెపై సమాజ్‌వాదీ పార్టీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. యాదవులకు రిజర్వేషన్లు అందకుండా చేయాలనే ఉద్దేశంతోనే అపర్ణ ఈ వ్యాఖలు చేశారని బీజేపీ సీనియర్‌ నాయకులు ఉమాభారతి ఆరోపించారు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని, కులం ఆధారంగానే భూమి లేని రైతులు, వడ్రంగులు, ఇతర కులాల వారు రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందగలుగుతున్నారని ఉమాభారతి పేర్కొన్నారు.

కాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎస్పీ - కాంగ్రెస్ నాయ‌కులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర‌స్థాయిలో దునుమాడుతున్నారు. త‌మ పార్టీల‌ తుఫాన్ బీజేపీ, బీఎస్పీలను తరిమికొడుతుందని, దేశంలో కంపెనీ రాజ్‌ను తేవాలనుకుంటున్న ప్ర‌ధాని పనయిపోతుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ వ్యాఖ్యానించారు. శాంతి, సామరస్యాలతో ఉండే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విద్వేషాలు ఎగదోయడానికి చేసే ప్రయత్నాలను అనుమతించబోమని ఎన్నిక‌ల‌ ర్యాలీలో రాహుల్‌గాంధీ అన్నారు. బీజేపీ తుఫాన్ దెబ్బకే యూపీ సీఎం ఎవరిసాయమైనా సరే తీసుకోవాలనే స్థితికి వెళ్లిపోయారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను అఖిలేశ్ తిప్పికొట్టారు. యూపీలో తుఫాన్ ఏదైనా ఉందంటే అది ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చే తుఫానే అని అన్నారు. 'మేము సమాజ్‌వాదీ ప్రజలం. నిజంగా ఏదైనా తుఫాన్ వచ్చినా దానిని మేము ఎదుర్కొంటాం. తుఫాన్ గుండా సైకిల్‌ను (ఎస్పీ ఎన్నికల చిహ్నం) ఎలా నడుపాలో మాకు తెలుసు' అని వ్యాఖ్యానించారు. 1857నాటి మీరట్ తిరుగుబాటు గురించి రాహుల్ ప్రస్తావిస్తూ "మీరు బ్రిటిష్ పాలకులకు పాఠం చెప్పారు. ఆనాడు కంపెనీ పాలన నుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు ప్రజలు పోరాడారు. కానీ, నేడు మోదీ భారత్‌లో ఓ రకమైన కంపెనీ రాజ్యాన్ని తేవాలనుకుంటున్నారు" అని విమర్శించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/