Begin typing your search above and press return to search.

ఏపీ వైసీపీకి ఇంత పెద్ద క‌ష్టం వ‌చ్చిందా ?

By:  Tupaki Desk   |   25 July 2021 7:00 AM IST
ఏపీ వైసీపీకి ఇంత పెద్ద క‌ష్టం వ‌చ్చిందా ?
X
ఏపీలో అధికార వైసీపీకి పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చిప‌డింది. దీనిని కనుక సీఎం జ‌గ‌న్ ఇప్ప‌ట్లో నివారించ‌క‌పోతే ఇది వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సునామీలా మారి వైసీపీని ముంచేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇది జ‌గ‌న్‌ను 2024లో అధికారానికి దూరం చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. అదే వైసీపీలో అంత‌ర్గ‌త యుద్ధం. శ్రీకాకుళం లేదు.. చిత్తూరు లేదు... ఇటు అనంతపురంతో మొద‌లు పెడితే క‌డ‌ప వ‌ర‌కు అన్ని జిల్లాల్లోనూ మంత్రులు వ‌ర్సెస్ ఎంపీల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం న‌డుస్తోంది. ఇక ఎంపీలు వ‌ర్సెస్ ఎమ్మెల్యేల‌కు కూడా ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. సీనియ‌ర్ నేత‌ల‌కు, జూనియ‌ర్ నేత‌ల‌కు మ‌ధ్య పెద్ద వార్ కొన‌సాగుతోంది. ఇక నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌కు ప్ర‌జ‌ల‌తో ట‌చ్‌లో ఉండే కీల‌క నేత‌ల‌కు ప‌డ‌డం లేదు.

ఇక నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనే కాదు.. మండ‌ల‌, గ్రామ‌స్థాయిలో కూడా వైసీపీ నేత‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీలోకి కోకొల్లుగా నాయ‌కులు చేరిపోయారు. ఇక ఎన్నిక‌ల త‌ర్వాత కూడా ఎంపీ స్థాయి, ఎమ్మెల్యే స్థాయి నేత‌ల నుంచి గ్రామాల్లో కూడా ఇత‌ర పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌లు అంద‌రూ ఫ్యాన్ గూటి కింద‌కు చేరిపోయారు. అయితే వీరంద‌రికి ప‌ద‌వులు, ప‌నులు, కాంట్రాక్టులు ఇవ్వ‌డం కుద‌ర‌ట్లేదు. ఇక ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారినా త‌మ‌కు అనుకూలంగా ఉన్న వారికే ప‌ద‌వులు, ప‌నులు ఇస్తున్నారు.

పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో ఉన్న వారు అయితే త‌మ‌కు క‌మీష‌న్లు ఇవ్వ‌రు.. వీరు అడ‌గ‌నూ లేరు. అదే పార్టీ మారి వ‌చ్చిన వాళ్ల‌కు ప‌ద‌వులు ఇస్తే డ‌బ్బులు తీసుకోవ‌చ్చు.. కాంట్రాక్టుల్లో క‌మీష‌న్లు తీసుకోవ‌చ్చ‌న్ని కొత్త స్ట్రాట‌జీతో ముందుకు వెళుతున్నారు. దీంతో పాత వ‌ర్సెస్ కొత్త నేత‌ల మ‌ధ్య వార్ మామూలుగా లేదు. పాత నేత‌లు ప్ర‌యార్టీ లేద‌ని ర‌గిలిపోతున్నారు. ప్ర‌తి గ్రామంలోనూ వైసీపీలోనే రెండు వ‌ర్గాలు కొన‌సాగుతున్నాయి. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఇలాగే కొన‌సాగితే అప్పుడు వైపీపీకి టీడీపీయో లేదా బీజేపీయో శ‌త్రువు కాన‌క్క‌ర్లేదు. వైసీపీకీ వైసీపీయే పెద్ద శ‌త్రువు అవుతుంద‌న‌డంలో డౌట్ అక్క‌ర్లేదు.

గ‌త ఐదేళ్ల‌లో టీడీపీ ప్ర‌భుత్వంలోనూ చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అంత‌ర్గ‌త యుద్ధంలోనే ఉన్నారు. ఒక‌రిపై మ‌రొక‌రు చంద్ర‌బాబుకు ఫిర్యాదులు చేస్తూ వ‌చ్చారు. చంద్ర‌బాబు సైతం వీటిని ప‌ట్టించుకోకుండా ప‌క్క‌న పెట్ట‌డంతో పాటు స‌యోధ్య కుదిర్చారు. చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ నేత‌లే ఒక‌రిని మ‌రొక‌రు ఓడించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసుకున్నారు. ఇలా అంద‌రూ ఓడిపోయి పార్టీని నిలువునా ముంచేశారు. రేప‌టి రోజున వైసీపీకి కూడా ఇదే ప‌రిస్థితి వ‌చ్చేలా ఉంది. జ‌గ‌న్ ఇప్పుడే మేలుకొని ఈ అంత‌ర్గ‌త యుద్ధాల‌కు గ్రామ‌స్థాయి నుంచే చెక్ పెట్టాల్సి ఉంది.