Begin typing your search above and press return to search.

టోల్ కట్టమంటే.. చేయి చేసుకోవటం ఏమిటమ్మా దేవళ్ల రేవతి?

By:  Tupaki Desk   |   10 Dec 2020 9:24 AM IST
టోల్ కట్టమంటే.. చేయి చేసుకోవటం ఏమిటమ్మా దేవళ్ల రేవతి?
X
అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు. వ్యవస్థల్ని తూలనాడేలా వ్యవహరించకూడదు. చిన్నపాటి ఇగోల కోసం ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా.. తనకు అధికారం ఇచ్చిన వారికి ఇబ్బంది పెట్టేలా చర్యలు ఉండకూడదన్న చిన్న విషయాన్ని ఏపీ వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి మర్చిపోయినట్లుగా కనిపిస్తున్నారు. చిన్న ఇష్యూను అనవసరంగా రచ్చ చేయటమే కాదు.. సిబ్బందిపై చేయి చేసుకున్న తీరు ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది.

టోల్ గేట్ దగ్గర ఎవరికి టోల్ వేయాలి? ఎవరి వద్ద వసూలు చేయకూడదన్న దానిపై అక్కడి సిబ్బంది నిబంధనల్ని పక్కాగా ఫాలో అవుతుంటారు. అప్పుడప్పుడు కొందరు నేతలు హడావుడి చేస్తుంటారు. తాజాగా అలాంటి పనే దేవళ్ల రేవతి చేశారన్న విమర్శ వినిపిస్తోంది.

గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద రేవతి భారీ హంగామా చేసినట్లు చెబుతున్నారు. టోల్ ఫీజ్ కట్టాలన్న సిబ్బంది మాటతో ఆగ్రహానికి గురైన ఆమె.. నన్నే టోల్ కట్టమంటావా? అని ఎదురు ప్రశ్నించటమే కాదు ఆవేశంతో ఊగిపోయినట్లుగా తెలుస్తోంది. తమ వాహనానికి అడ్డుగా పెట్టిన బారికేడ్లను ఆమె స్వయంగా తొలగించటం.. ఆ సందర్భంగా అడ్డుకోబోయిన సిబ్బందిపై ఆమెచేయి చేసుకున్న వైనం సంచలనంగా మారింది.

‘‘నన్నే ఆపుతావా? నేనేం అనుకుంటున్నావ్?’’ అంటూ ఆగ్రహానికి గురైన ఆమె.. టోల్ బారికేడ్లను అడ్గు తొలగించుకొని మరీ విజయవాడకు దూసుకెళ్లారు. ఆమె తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారటమే కాదు.. ఇమేజ్ డ్యామేజ్ చేస్తాయన్న విషయాన్ని ఆమె ఎందుకు మిస్ అవుతున్నట్లు?