Begin typing your search above and press return to search.

అప్పుల తిప్ప‌లు త‌ప్ప‌వా?

By:  Tupaki Desk   |   5 Oct 2021 11:30 AM GMT
అప్పుల తిప్ప‌లు త‌ప్ప‌వా?
X
ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించాలంటే ఏ ప్రభుత్వ‌మైనా అప్పులు చేయాల్సింది. ఇచ్చిన హ‌మీలు నెర‌వేర్చేందుకు ఎన్నిక‌ల్లో గెలిచి అధికారం నిల‌బెట్టుకోవాల‌న్న ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందేందుకు వాళ్లు అవ‌స‌రాలు తీర్చేందుకు అప్పులు చేయ‌డం తప్ప‌నిస‌రి అయిపోయింది. అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రాల్లో అదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్పుడు ఏపీలోనూ
నెలాఖ‌రు వ‌స్తుందంటే చాలు.. అప్పుల కోసం చూడాల్సిన ప‌రిస్థితి ఉంది. కొత్త అప్పులు ఎలా తేవాలి? ఎక్కడి నుంచి తేవాల‌నే లెక్క‌ల్లో ఆర్థిక శాఖ త‌ల‌మున‌క‌ల‌వుతోంది. అద‌న‌పు అప్పుల కోసం కేంద్రం నుంచి అనుమ‌తి రాగానే.. రిజ‌ర్వ్ బ్యాంకు ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చింది. తాజాగా మ‌రో రూ.2 వేల కోట్లు తేనుంది. మ‌రోవైపు రాష్ట్రాభివృద్ధి కార్పొరేష‌న్ ద్వారా రూ.3,500 కోట్లు అప్పు తెచ్చింది. ఇలా ఒక నెల వ్య‌వ‌ధిలోనే స‌రిగా రూ.10,500 కోట్లు అప్పు చేసింది.

కొత్త అప్పుల‌కు అనుమ‌తి రాగానే ఆర్బీఐని ఆశ్ర‌యిస్తున్న ప్ర‌భుత్వం. . ఆ ప‌రిమితి పూర్తి కాగానే మ‌ళ్లీ ఢిల్లీ వెళ్లి కేంద్రం చుట్టూ తిరిగి కొత్త అప్పుల‌కు అనుమ‌తి సంపాదిస్తుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కొత్త‌గా రూ.10,500 కోట్లు అప్పు చేసుకునేందుకు సెప్టెంబ‌ర్ 3న రాష్ట్రానికి కేంద్రం అనుమ‌తినిచ్చింది. గ‌త నెల‌లోనే రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.5 వేల కోట్లు అప్పు తీసుకుంది. ఈ నెల‌లో మిగిలిన రూ.5,500 కోట్లు తీసుకునేందుకు అవకాశ‌మివ్వాల‌ని ఆర్బీఐకి ఆర్థిక శాఖ స‌మాచారం పంపిన‌ట్లు తెలిసింది. ఈ మంగ‌ళ‌వారం సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.2000 కోట్లు తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇదే విధంగా వ‌చ్చే మంగ‌ళ‌వారాల్లోనూ సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఇంకో రూ.3,500 కోట్లు అప్పు పొందేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

అయితే అక్టోబ‌ర్ ముగిసిన త‌ర్వాత మ‌ళ్లీ కొత్త అప్పుల కోసం కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేంద్రం సెప్టెంబ‌ర్‌లో అనుమ‌తిచ్చిన రూ.10,500 కోట్ల అప్పుల‌తో సెప్టెంబ‌ర్ అక్టోబ‌ర్ గ‌డిచిపోయింది. కానీ న‌వంబ‌ర్ డిసెంబ‌ర్ గ‌డ‌వాలంటే మ‌రో రూ.10,500 కోట్లు అవ‌స‌రం అవుతాయి. ఒక‌వేళ అప్పు దొర‌క‌క‌పోతే ప్ర‌భుత్వం పాత బ‌కాయిల‌కు వ‌డ్డీలు క‌ట్ట‌లేద‌ని ఉద్యోగుల‌కు వేత‌నాలు పెన్ష‌న్లు కూడా ఇవ్వ‌లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఏపీ అడ‌గ‌గానే నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండా అద‌న‌పు అప్పుల కోసం కేంద్రం అనుమ‌తి ఇస్తుంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

రాష్ట్రాలు అప్పు చేసుకునేందుకు కేంద్రం ఏ ప్రాతిప‌దిక‌న అనుమ‌తి ఇస్తుందో స్ప‌ష్టం చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 283 (3) ప్ర‌కారం రాష్ట్రాలు తీసుకోవాల్సిన రుణాన్ని కేంద్రం నిర్ణయిస్తుంది. జీఎస్‌డీపీలో 3 శాతం లేదా కేంద్రం అనుమ‌తి ఇచ్చిన ప‌ర్సంటేజీ మొత్తాన్ని ఆ ఆర్థిక సంవ‌త్స‌రంలో అప్పుగా తెచ్చేందుకు అనుమ‌తిస్తారు. ఇలా 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏపీ నికరంగా రూ.42,000 కోట్లు అప్పు చేసుకోవ‌చ్చ‌ని రాష్ట్రానికి రాసిన లేఖ‌లో కేంద్రం స్ప‌ష్టం చేసింది. కానీ అది కాకుండా మ‌ళ్లీ గ‌త నెల 3న రూ.10,500 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమ‌తించింది. కానీ రాజ్యంగంలోని ఏ నిబంధ‌న ప్ర‌కారం ఈ అద‌న‌పు అప్పుల‌ను నిర్ణ‌యించారో అందులో ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. ఈ విష‌యంలో ఆర్థిక నిపుణులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేష‌న్ విష‌యంలో ఏపీ రాజ్యాంగ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డింద‌ని చెప్పిన కేంద్ర‌మే.. ఇప్పుడు స్వ‌యంగా రాజ్యంగ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుడూ ఏపీకి అద‌న‌పు అప్పులు చేసుకునేందుకు అవ‌కాశం ఇస్తుంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.