Begin typing your search above and press return to search.

రూ.5వేలకు వెయ్యి ఇస్తావా? రైతుపై తహశీల్దార్ ఆగ్రహం ఇప్పుడు హాట్ టాపిక్

By:  Tupaki Desk   |   16 Nov 2022 10:26 AM IST
రూ.5వేలకు వెయ్యి ఇస్తావా? రైతుపై తహశీల్దార్ ఆగ్రహం ఇప్పుడు హాట్ టాపిక్
X
తమ పాలనలో అవినీతిని అమడదూరంలో ఉంచేసినట్లుగా చెప్పుకునే ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకరు. తాజాగా వెలుగు చూసిన వైనం చూస్తే.. ఏపీలోని పరిస్థితులు.. అధికారులు వ్యవహరించే తీరు మరీ ఇంత దారుణంగా ఉంటుందా? అన్న భావన కలుగక మానదు. తాజాగా చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఉదంతం.. రెవెన్యూ అధికారి వ్యవహరించిన తీరును చూస్తే.. రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో ఉందన్నది అర్థమవుతుంది.

చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండల పరిధిలోని పూనేపల్లికి చెందిన రైతు సయ్యిద్. అతగాడికి ఉన్న వ్యవసాయ భూమిని.. కమర్షియల్ ల్యాండ్ గా మార్చుకోవాలని భావించాడు. ఇందులో భాగంగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. తాను కోరినట్లుగా తన భూమి తీరును మార్చాలని కోరారు. అందుకు తహశీల్దార్ రమణి.. రూ.5వేలు ఖర్చు అవుతుందని.. ఆ మొత్తాన్ని తీసుకొస్తే పని పూర్తి చేస్తానని చెప్పారు.

అయితే.. రూ.5వేలు సర్దుబాటు కాక.. రూ.వెయ్యి తీసుకొచ్చిన సయ్యిద్.. రమణి చేతిలో పెట్టారు. తాను రూ.5వేలు అడిగితే వెయ్యి రూపాయిలు ఇవ్వటంపై మండిపాటు ప్రదర్శించిన రెవెన్యూ అధికారి.. రూ.5వేలు ఇస్తేనే ధ్రువీకరణ పత్రం ఇస్తామని.. లేదంటే కుదరదని తేల్చి చెప్పారు.

'ఎందయ్యా మీరు? చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రూ.5వేలు ఇస్తానని చెప్పి వెయ్యి ఇస్తావా? పక్కన ఇచ్చి పని చేసుకో' అంటూ అసహనాన్ని ప్రదర్శించారు. అయితే.. రమణి మేడమ్ భాగోతాన్ని వీడియో తీసి.. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో.. ఈ ఎపిసోడ్ ఇప్పుడు రచ్చగా మారింది.

ఉన్నతాధికారులు తహశీల్దార్ రమణి తీరుపై సీరియస్ గా ఉన్నారని.. చర్యలకు ఉపక్రమిస్తున్నట్లుగా చెబుతున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా..ఏపీలో అధికారుల తీరు ఏ రీతిలో ఉందన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా ఉందని మాత్రం చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.