Begin typing your search above and press return to search.

శివాజీ ....చంద్రబాబు బినామీ అట‌!

By:  Tupaki Desk   |   11 Sep 2018 4:28 PM GMT
శివాజీ ....చంద్రబాబు బినామీ అట‌!
X
3 నెల‌ల క్రితం `ఆప‌రేష‌న్ గ‌రుడ‌`పేరుతో సినీ న‌టుడు శివాజీ సంచ‌ల‌నం రేపిన సంగతి తెలిసిందే. ఆప‌రేష‌న్ గ‌రుడ ప్ర‌కారం చంద్ర‌బాబు చిక్కుల్లో ప‌డ‌తార‌ని శివాజీ చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపాయి. తాజాగా - మ‌రోసారి ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో భాగంగా చంద్రబాబుకు కేంద్రం నోటీసులివ్వ‌బోతోందంటూ శివాజీ హ‌డావిడి చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఓ కేంద్ర సంస్థ నుంచి చంద్ర‌బాబుకు నోటీసులు రాబోతున్నాయ‌ని - ఆ వివరాలు తాను వెల్ల‌డించ‌న‌లేన‌ని - తనకు ప్రాణహాని కూడా ఉందని విలేకరుల సమావేశంలో చెప్పి క‌ల‌క‌లం రేపారు. ఈ నేప‌థ్యంలోనే ఆప‌రేష‌న్ గరుడ‌ - శివాజీల‌పై విచార‌ణ చేయాల‌ని ఏపీ డీజీపీకి బీజేపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఆ ఆప‌రేష‌న్ కు బీజేపీకి సంబంధం లేద‌ని - అందులో విష‌యాలు నిజ‌మైతే చంద్ర‌బాబుపై....అబద్ధ‌మైతే శివాజీ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో తాజాగా, శివాజీపై - చంద్ర‌బాబుపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య మండిపడ్డారు. ఆపరేషన్‌ గరుడ బూటకమని - చంద్రబాబుకు శివాజీ బినామీ అన్న అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

చంద్ర‌బాబుకు నోటీసులంటూ శివాజీ కొత్త డ్రామాకు తెరతీశారని ఆయ‌న‌ ఆరోపించారు. ఆపరేషన్‌ గరుడపై విచారణ జరపాల‌న్న బీజేపీ ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదన్నారు. చంద్రబాబును శివాజీ వెనకేసుకు రావ‌డం చూస్తుంటే చంద్రబాబుకు అతను బినామీ అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. రాష్ట్ర పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే శివాజీ వ్యాఖ్యలపై వెంట‌నే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాలు విధిస్తున్న రూ.10 పన్ను భారాన్ని ఉపసంహరించుకోవాలని గతంలోనే కేంద్రం కోరిందని, ఏపీలో అధిక పెట్రోల్‌ ధరలకు టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆయ‌న విమర్శించారు. పెట్రోల్‌ - డీజిల్‌ పై రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్ను భారాన్ని తగ్గించాలని ఆయ‌న కోరారు.