Begin typing your search above and press return to search.

కోడెల సమన్యాయం ఇదేనా?

By:  Tupaki Desk   |   30 Jan 2019 7:55 AM GMT
కోడెల సమన్యాయం ఇదేనా?
X
ఏపీ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.. ఏంటా నిర్ణయం అనుకుంటున్నారా.? స్పీకర్ కోడెల ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో ఏ నిర్ణయంపై వెంటనే స్పందించిన దాఖాలాలు లేవు. అలాంటి ఆయన ఆ ఇద్దరి రాజీనామా విషయంలో తక్షణమే స్పందించారు. కోడెల ఇంత స్పీడుగా స్పందిస్తారా? అనేలా చేసి అందరికీ షాక్ ఇచ్చారు.

బీజేపీకి చెందిన ఆకుల సత్యానారాయణ, టీడీపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వారు ఇలా స్పీకర్ కు రాజీనామా ఇచ్చారో లేదో ఆయన వెంటనే ఆమోదించేశారు. ఆ ఇద్దరితో మాట్లాడిన తరువాతే రాజీనామాలు ఆమోదించానని ఆయన చెప్పడం గమనార్హం.

ఏపీలో చివరి అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ వారిద్దరి రాజీమాలు ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీడీపీలో కొనసాగుతున్న వారిపై అనర్హత వేయాలని బాధిత వైఎస్ఆర్ సీపీ నాయకులు స్పీకర్ ను కలిసి ఎంత గొగ్గోలుపెట్టినా ఆయన పట్టించుకున్న పాపానా పోలేదు. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల్లో నలుగురు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా మారి వైభోగం అనుభవిస్తున్న ఆయన పట్టలేదు. తమకు న్యాయం జరుగలేదని అసెంబ్లీ సమావేశాలను ఆ పార్టీ నేతలు బాయ్ కాట్ చేసిన సంగతి తెల్సిందే.

చివరి అసెంబ్లీ సమావేశాలు జరుగనుండగా ఒకరోజు ముందు ఇద్దరి ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ పదవిలో ఉంటూ అన్ని పార్టీలను సమన్యాయంగా చూడాల్సిన ఆయన పక్షపాతం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ ఫిరాయింపుదారులపై స్పీకర్ ఇంకెప్పుడు నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

స్పీకర్ కోడెల శివప్రసాద్ చివరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేసేలా కనిపించడం లేదు. కేవలం ఆయన అధికార పక్షానికే వంతపడటానికే ఆ కుర్చీలో కూర్చున్నారు అనేలా ఆయన వ్యవహార శైలి ఉందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా స్పీకర్ పదవీకి ఉన్న ఔచిత్యాన్ని కాపాడుతారా లేక అధికార నేతలకే వంతపాడుతారా అనేది చూడాలి.