Begin typing your search above and press return to search.

స్పీకర్ గారు బాలక్రిష్ణ సినిమాలు బాగా చూస్తారు అనుకుంటా..!

By:  Tupaki Desk   |   1 Jan 2023 8:59 AM GMT
స్పీకర్ గారు బాలక్రిష్ణ సినిమాలు బాగా చూస్తారు అనుకుంటా..!
X
ఆయన శాసనసభ స్పీకర్. ఆయన ఫైర్ బ్రాండ్. మాటల తూటాలను ప్రత్యర్ధుల మీద పేలుస్తారు. ఆయనే తమ్మినేని సీతారాం. ఆయన ఇపుడు తొడ కొట్టారు. దాంతో అది సంచలనమవుతోంది. స్పీకర్ గారు తొడగొట్టడమేంటి అని అనుకోకండి. ఆయనలోని ఆవేశం అలా చేసింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు చేసే క్రమంలో స్పీకర్ తొడగొట్టి సవాల్ చేశారు. చంద్రబాబు ఎపుడూ మాటలకే పరిమితం అవుతారు తప్ప చేతలలో ఆయన చేసేది ఏమీ ఉండదని తమ్మినేని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, అలాగే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, కానీ ఎన్నికలు అయి అధికారంలోకి రాగానే వాటిని పక్కన పెట్టి మోసం చేశారని ఆయన ఘాటైన విమర్శలు సంధించారు.

ఇక రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి రైతులను నిలువునా వంచించారని తమ్మినేని మండిపడ్డారు. నారావారి పల్లెలో కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉండే చంద్రబాబు ఇపుడు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారని తమ్మినేని ప్రశ్నించారు. ఆయన దగ్గర ఏదైనా మంత్రదండం ఉందా అని తమ్మినేని అడుగుతున్నారు.

ఒకవేళ ఆయన దగ్గర కనుక ఆ మంత్రదండం ఉంటే దానిని నిరుపేదలకు ఇస్తే వారు కూడా బాగుపడతారు కదా అని ఆయన అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదని చంద్రబాబు పీకి పారేస్తారని ఆయన చెబుతున్నారు. మరో వైపు వాలంటీర్లను కూడా ప్రభుత్వ ఉద్యోగుల కింద త్వరలో ప్రభుత్వం ప్రకటన చేయనుందని తమ్మినేని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.

వారి పేరులోనే వాలంటీర్లు ఉంటే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా చేస్తారు అని ఇదే ప్రభుత్వం గతంలో ప్రకటించింది, పైగా వారికి ఇచ్చేది గౌరవ వేతనమే అని చెబుతున్నారు. అలాంటి వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తామని చెప్పడం అంటే ఇది నమ్మదగ్గ విషయమెనా అన్న చర్చ వస్తోంది. లేక ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉందా అన్నది కూడా ప్రశ్నలుగా వస్తున్నాయి.

వాలంటీర్లను ప్రభుత్వం పర్మనెంట్ చేస్తుంది అనుకుంటే అపుడు వారంతా వైసీపీకి గట్టి ఓటు బ్యాంక్ గా మారుతారు అన్న ఆలోచన ఏదైనా ఉందేమో చూడాలి. ఇవన్నీ పక్కన పెడితే తమ్మినేని సీతారాం తొడకొట్టుడు మాత్రం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన టీడీపీని చాలెంజ్ చేస్తూ ఈ విధంగా తొడగొట్టారని అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో వాలంటీర్ల తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మట్లాడారు. తాను గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తే అక్కడ ఒక మహిళ మళ్ళీ జగన్ కే ఓటు వేస్తాను అని చెప్పి తొడ కొట్టిందని స్పీకర్ చెప్పుకొచ్చారు. ఆమెను అనుకరిస్తూ ఆయన తొడకొట్టారన్న మాట. మొత్తానికి ఆయన తొడకొట్టుడు చూసిన వారు అంతా బాలయ్య సినిమాలు స్పీకర్ తెగ చూస్తారా అని సెటైర్లు వేస్తున్నారు.