Begin typing your search above and press return to search.

ఎన్నికలెందుకు: న్యాయస్థానాలపై తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   2 July 2020 2:28 PM GMT
ఎన్నికలెందుకు: న్యాయస్థానాలపై తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
X
ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం న్యాయస్థానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టులే ప్రభుత్వాలు నడిపిస్తాయా, అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు అని వ్యాఖ్యానించారు. ఆయన గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో రాజకీయ వికృత చేష్టలు పరాకాష్టకు చేరుకున్నాయని, కోర్టులు పరిపాలనలో జోక్యం చేసుకుంటే ఇక ప్రభుత్వాలు ఎందుకు అన్నారు.

ఎన్నికలు నిర్వహించడం ఎందుకు, ఎమ్మెల్యేలు, సీఎంలు, ఎంపీలు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాల్లో కోర్టుల జోక్యం సరికాదన్నారు. ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ జొరబడటం అవుతుందన్నారు. అలాంటప్పుడు న్యాయస్థానంలో ప్రభుత్వాన్ని నడిపిస్తాయా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకున్నప్పటికీ వ్యవస్థలపై గౌరవంతో తీర్పులు అంగీకరిస్తున్నామని చెప్పారు.

తమ నిర్ణయాలు తప్పుగా భావిస్తే తమను గెలిపించిన ప్రజలు వచ్చేసారి ఓడిస్తారని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా కోర్టు తీర్పులు వెలువడటం బాధాకరమని అభిప్రాయపడ్డారు. కాగా, జగన్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటింది. కోర్టులు పలుమార్లు ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. దీంతో ఏ ఒక్క అంశాన్ని ప్రస్తావించకుండా తమ్మినేని సీతారాం కోర్టు తీర్పులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.